బాల రాముడి కిరీటం విలువ, ప్రత్యేకత తెలుసా?
అయోధ్యలో బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 23 Jan 2024 10:30 AM GMTఅయోధ్యలో బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగిన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కర్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యిందన్నా అతిశయోక్తి కాదేమో! ఇక ఈ కార్యక్రమం ద్వారా వేల మంది వీఐపీలకు నిన్న ప్రత్యక్షంగా రాముని దర్శన భాగ్యం దక్కగా... నేటి నుంచి సామాన్య భక్తులకు రాముని దర్శనం కల్పిస్తున్నారు.
దీంతో వేలాది మంది భక్తులు ఈరోజు తెల్లవారుజాముకే అయోధ్య రామ మందిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాములోరికి భారీ విరాళాలను కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వజ్రాల వ్యాపారి కోట్ల విలువైన కిరీటాన్ని బహుకరించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవును... అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరంలో ప్రతిష్టించిన రామ్ లల్లా విగ్రహానికి గుజరాత్ లోని సూరత్ కు చెందిన గ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ముఖేష్ పటేల్ కిరీటం బహుకరించారు! సుమారు 11 కోట్ల రూపాయలు విలువైనదిగా చెబుతున్న ఈ కిరీటాన్ని నవనిర్మిత రామమందిరంలో బాలరాముడి కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
బంగారం, విలువైన రత్నాలు, వజ్రాలతో అలంకరించబడిన ఈ కిరీటం బరువు 6 కిలోలని చెబుతున్నారు. ఈ కిరీటాన్ని బాల రాముడికి సమర్పించారు! ఇందులో భాగంగా.. తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగతంగా అయోధ్యను సందర్శించిన ముకేశ్ పటేల్... రామమందిరం ప్రధాన అర్చకులు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ధర్మకర్తల సమక్షంలో ఈ కిరీటాన్ని అందజేశారు.
కాగా... నవనిర్మితమైన రామందిరంలో కొలువుదీరిన సమయంలో బాలరాముడికి ఎంతో విశిష్టత కలిగిన ఆభరణాలను అలంకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కిరీటం, కౌస్తుభ మణి, విజయమాల, కాంత, పాదిక, నడుము పట్టీ, కంచి, కంకణాలు, ఉంగరాలతో అలకంరించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ విగ్రహ నుదుటిపై వెండి, ఎరుపు తిలకాన్ని వజ్రాలు, కెంపులతో రూపొందించారు.