ఇదో ప్రత్యేకం.. 500 ఏళ్ల తర్వాత రాముడి ఇంట్లో తొలి దీపావళి..
500 ఏళ్ల తర్వాత రాముడు తన ఇంట్లో కూర్చున్నాడని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 29 Oct 2024 5:30 PM GMTఅయోధ్య రామ మందిరం ఈ ఏడాది జనవరిలో అత్యంత వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల ఆకాంక్ష.. మరెన్నో వివాదాలు.. అంతకుమించిన ఉద్వేగాలతో అయోధ్యలో బాల రాముడి ఆలయ ప్రతిష్ఠాపన జరిగింది. దేశ విదేశాల నుంచి హాజరైన ప్రముఖుల నడుమ.. ప్రధాని మోదీ చేతుల మీదుగా.. అందంగా ముస్తాబైన అయోధ్యలో..బాల రాముడు కొలువయ్యాడు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులకు రెండు కళ్లూ చాలలేదంటే అతిశయోక్తి కాదేమో..? అందుకే ఈసారి ప్రత్యేకమైన దీపావళిని చూస్తున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 500 ఏళ్ల తర్వాత రాముడు తన ఇంట్లో కూర్చున్నాడని పేర్కొన్నారు. రోజ్ గార్ మేళాలో భాగంగా వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజలకు ‘ధన త్రయోదశి’ శుభాకాంక్షలు తెలిపారు. మరో రెండ్రోజుల్లో ప్రత్యేక దీపావళి జరుపుకోబోతున్నామన్నారు.
ఇందుకే ప్రత్యేక దీపావళి..
అయోధ్యలో ఆటంకాలన్నీ తొలగి దాదాపు 500 ఏళ్ల తర్వాత రామాలయం సాకారమైన సంగతి తెలిసిందే. అలా అయోధ్య ఆలయంలోకి శ్రీరాముడు కొలువైన తర్వాత వచ్చిన తొలి దీపావళి ఇదే. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి తర్వాత అయోధ్య రామాలయం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉగాది, వినాయక చవితి, దసరా పండుగలు జరిగాయి. ఇప్పుడు దీపావళి వచ్చింది. కాగా, ఈ ప్రత్యేక వేళకు మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నామని మోదీ అభివర్ణించారు. ఈ దీపావళి కోసం ఎన్నో తరాలు గడిచాయని.. లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారని, హింసను భరించారని మోదీ అన్నారు. అలాంటి ప్రత్యేక గొప్ప దీపావళిని చూసేందుకు మనమందరం చాలా అదృష్టవంతులమని పేర్కొన్నారు. యువతకు గరిష్ఠంగా ఉపాధి కల్పించడం తమ ప్రభుత్వ నిబద్ధతగా చెప్పారు.
ఉద్యోగ దీపావళి..
కేంద్ర ప్రభుత్వం దేశంలో 40 ప్రదేశాల్లో రోజ్ గార్ (ఉద్యోగ) మేళాలను నిర్వహించింది. దీంతో వివిధ మంత్రిత్వశాఖల్లో నియామకాలను చేపట్టారు. కొత్త ఉద్యోగులకు ‘కర్మయోగి ప్రారంభ్’ విధానం కింద శిక్షణ ఇస్తున్నారు. ఐజీవోటీ కర్మయోగి పోర్టల్ లో దాదాపు 1,400 కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్పేందుకు ఇవి ఉపయోగపడతాయి. మొత్తంమీద 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశామని ప్రధాని మోదీ చెప్పారు. రోజ్ గార్ మేళాలను తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ లలో నిర్వహించారు. వైజాగ్‌లో వీఎంఆర్డీఏలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఇక హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. 155 మందికి ఆయన నియామక పత్రాలు అందించారు.