Begin typing your search above and press return to search.

అచ్చెన్న బాహుబలి!

ఇదే సందర్భంలో తన బాబాయ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన బాబాయ్ బాహుబలి అని కితాబు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 1:30 AM GMT
అచ్చెన్న బాహుబలి!
X

ఉత్తరాంధ్ర జిల్లాలలో బీసీలు ఎక్కువగా ఉంటారు. లీడర్లు కూడా వారి నుంచే వస్తారు. టీడీపీ ఉత్తరాంధ్రాలో బలపడడానికి బీసీలు వెన్నటి ఉండడం ప్రధాన కారణం. అందుకే టీడీపీని బీసీల పార్టీ అని అంటారు. టీడీపీ ద్వారా బీసీలు ఎంతో మంది అనేక రకాల రాజకీయ అవకాశాలు అందుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. దీని మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బీసీలకు వెన్నెముకగా టీడీపీ నిలిచింది అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా ఎందరో అధికారానికి చేరువ అయ్యారని ఆయన గుర్తు చేస్తున్నారు.

తనలాంటి ఒక జూనియర్ నేతకు కేంద్ర మంత్రి స్థాయి అధికారాన్ని చంద్రబాబు ఇచ్చారు అని ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంలో తన బాబాయ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన బాబాయ్ బాహుబలి అని కితాబు ఇచ్చారు. ఆయన బిగ్ ఫిగర్ గా అభివర్ణించారు. రామ్మోహన్ అన్నట్లుగా అచ్చెన్న ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బిగ్ ఫిగర్ గానే ఉన్నారు. ఆయన ఎర్రన్నాయుడి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.

చంద్రబాబు వద్ద తన అన్న మాదిరిగానే మంచి సాన్నిహిత్యం సంపాదించారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఆయన చాలా కాలం పాటు పనిచేశారు. 2014 నుంచి 2019 దాకా ఆయిదేళ్ళ పాటు తిరిగి ఇపుడు మరోసారి ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు. కీలక మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు.

అందువల్ల రాజకీయ బాహుబలిగా అచ్చెన్నను చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగుదేశం పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే అచ్చెన్నాయుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవారు అన్నది కూడా అంతా చెప్పే మాట. కూటమి ప్రభుత్వం కావడంతో ఆయన మంత్రిగానే ఉన్నారు. అయినా అచ్చెన్న ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదు.

అదే విషయాన్ని రామ్మోహన్ చెబుతూ అచ్చెన్నను పొలిటికల్ గా టాల్ మాన్ అనేశారు. టీడీపీలో నాలుగు దశాబ్దాల పాటు కింజరాపు కుటుంబం కొనసాగడమే కాకుండా తమ రాజకీయ ఉనికిని పదిలపరచుకుంటూ ముందుకు సాగుతోంది. బీసీ నేతలు అంటే ఆ ఫ్యామిలీయే ముందుగా గుర్తుకు వచ్చేలా చేసుకుంటోంది. ఇంతకీ ఈ పొలిటికల్ బాహుబలి అచ్చెన్నకు మంత్రితో సరా ఇంకా ఏమైనా ప్రమోషన్లు ఉంటాయా అన్నదే తమ్ముళ్ళు తర్కించుకుంటున్నారు.