Begin typing your search above and press return to search.

పండుగ పూట బాదేసే విమాన సంస్థలపై కన్నేశాం!

అలా అని ధరలు మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి’’ అంటూ తాను చెప్పాల్సింది చెప్పేశారు.

By:  Tupaki Desk   |   9 Sep 2024 10:30 PM GMT
పండుగ పూట బాదేసే విమాన సంస్థలపై కన్నేశాం!
X

పండుగ సీజన్ లో ఇష్టం వచ్చినట్లుగా విమాన టికెట్ ధరల్ని బాదేస్తామంటే ఊరుకునేది లేదని.. అలాంటి విమానయాన సంస్థల్ని చూస్తూ ఊరుకోమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు. పండుగ సీజన్ లో ఎక్కువమంది ప్రయాణించే మార్గాల్లో ఎయిర్ లైన్స్ సంస్థలు వసూలు చేసే టికెట్ ధరల్ని తాము గమనిస్తున్నామని.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా చేయొద్దని ఇప్పటికే తాము చెప్పినట్లుగా చెప్పారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏ విమానయాన సంస్థా ఒక విధమైన టికెట్ ధర వసూలు చేయాలని ఒత్తిడి చేయం. అలా అని ధరలు మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి’’ అంటూ తాను చెప్పాల్సింది చెప్పేశారు.

పండుగ సీజన్ లో ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్లాలని అనుకుంటారని.. ఇలాంటి వేళ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని విమానసంస్థలకు తాము సూచన చేశమన్నారు. పండుగ వేళలో టికెట్ ధరలపై తాము కన్నేసి ఉంచినట్లు స్పష్టం చేశారు. పండుగ సీజన్ కు ముందు విమాన టికెట్ ధరలపై ఇంత స్పష్టంగా ఇప్పటివరకు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి లేరనే చెప్పాలి. టికెట్ ధరల మీదే కాదు.. విమాన సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల మీదా రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్ తో దెబ్బ తిన్న విమానయాన రంగం పూర్తిగా కోలుకోలేదన్న కేంద్రమంత్రి.. అందుకు దేశీయ స్పైస్ జెట్ ఒక చక్కని ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ సంస్థ ఇప్పుడు ఆర్థిక కష్టాలు.. లీగల్ చిక్కుముళ్లను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. సదరు సంస్థ నిధుల సమీకరణలో పడిందని.. స్పైస్ జెట్ పరిస్థితిని తాము గమనిస్తున్నట్లు చెప్పారు. 2035 నాటికి భారత్ అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్ గా అవతరిస్తుందన్న కేంద్ర మంత్రి.. రానున్న 10 నుంచి 20 ఏళ్లలో దేశంలో 350 నుంచి 400 వరకు ఎయిర్ పోర్టులను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరి.. కేంద్రమంత్రి చెప్పినట్లుగా పండుగ వేళ.. విమాన టికెట్ ధరలపై విమానయాన సంస్థలు ఎలా వ్యవహరిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.