వరంగల్ ఎయిర్ పోర్ట్ కు బీఆర్ఎస్ సహకరించలేదు.. బాంబుపేల్చిన రామ్మోహన్ నాయుడు!
తెలంగాణ రాష్ట్రంలో రెండవ విమానాశ్రయాన్ని కేటాయిస్తూ.. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను చివరకు ఆమోదించింది
By: Tupaki Desk | 3 March 2025 2:52 PM ISTభారత పౌర విమానయాన శాఖ గత వారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విమానాశ్రయాన్ని కేటాయిస్తూ.. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను చివరకు ఆమోదించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సహకరించలేదని, భూసేకరణకు సహాయపడలేదని వెల్లడించారు.తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా గత ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన దుయ్యబట్టారు..
“వరంగల్ ఎయిర్ పోర్టుపై కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా క్రెడిట్ తీసుకోవచ్చు, కానీ ప్రజలకు వాస్తవం తెలియాలి. వరంగల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ఆ ప్రాంతం యొక్క చారిత్రాత్మక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) దీన్ని అభివృద్ధి చేస్తుంది. మేము దీనిని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని మంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు.
కొంతమంది బీఆర్‌ఎస్ నేతలు వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌కు క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. సంబంధిత కేంద్రమంత్రి అసలు నిజాన్ని వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా వ్యవహరించిన విషయాన్ని ఆయన స్పష్టంగా బయటపెట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో ఉడాన్ స్కీమ్ కింద మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నప్పటికీ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందలేదు అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పెద్ద విమానాలు ల్యాండ్ కావడానికి అదనంగా 280 ఎకరాలు కేటాయించాలని గత ప్రభుత్వాన్ని కోరినా వారు పట్టించుకోలేదన్నారు.
జ్యోతిరాధిత్య సింధియా ఎంత కోరినా ల్యాండ్ ఇవ్వలేదని .. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం.. కదలిక రాలేదని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత రాష్ట్ర ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇదే విషయం సూచిస్తే నవంబర్ లో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చి భూమి కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్‌ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. టెర్మినల్ బిల్డింగ్ డిజైన్ కాకతీయుల గొప్ప చరిత్రను ప్రతిబింబించేలా రూపొందించనున్నారు.
వరంగల్ ఎయిర్ పోర్ట్ జాప్యంపై రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఉదారంగా, రాజనీతిజ్ఞతతో వ్యవహరించారని రామ్ మోహన్ నాయుడు అన్నారు. “నేను బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు, చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిని సమానంగా చూడాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. దానికి అనుగుణంగా, తెలంగాణ ప్రజల కోరిక అయిన వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ను మంజూరు చేశాం,” అని నాయుడు తెలిపారు.