Begin typing your search above and press return to search.

పోలికతో షాకిచ్చిన రామ్మోహన్ నాయుడు.. నంబితో బాబుకు పోలికా?

టీడీపీ అభిమానులు రామ్మోహన్ నాయుడి వాదనకు ఫిదా అయిపోగా.. వైసీపీ నేతలు.. అభిమానులు.. మద్దతుదారులు మాత్రం తిట్టిపోస్తున్నారు

By:  Tupaki Desk   |   22 Sep 2023 4:32 AM GMT
పోలికతో షాకిచ్చిన రామ్మోహన్ నాయుడు.. నంబితో బాబుకు పోలికా?
X

పోలికతో షాకిచ్చారు తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. మంచి వక్త అయిన రామ్మోహన్ నాయుడు చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో జరుగుతున్న చర్చలో పాల్గొన్న టీడీపీ ఎంపీ.. చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చి.. ఆయన అరెస్టు పై వినిపించిన వాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అభిమానులు రామ్మోహన్ నాయుడి వాదనకు ఫిదా అయిపోగా.. వైసీపీ నేతలు.. అభిమానులు.. మద్దతుదారులు మాత్రం తిట్టిపోస్తున్నారు.

ఇంతకూ ఇంతటి చర్చకు కారణం రామ్మోహన్ నాయుడి వాదనగా చెప్పాలి. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు ఉదంతాన్ని నిజాయితీపరుడైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ పై కక్ష సాధింపుతో తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపినట్లే.. 45 ఏళ్లు రాష్ట్రానికి సేవలు అందించిన చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా పేర్కొన్నారు.

నంబిని అరెస్టు చేసిన జైలుకు పంపటం చూసిన తర్వాత కష్టపడి పని చేసి దేశానికి సేవ చేయాలనుకునే శాస్త్రవేత్తల మనసుల్లో భయాందోళనలు రేకెత్తాయని.. ఇప్పుడు బాబు అరెస్టుతో తన లాంటి యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించిన వైనం ఆసక్తికరంగా మారింది. ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తుందని.. ఆ పరిస్థితుల్లో పోరాడేవారు నాయకులుగా ఎదుగుతారని తమ నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారన్న రామ్మోహన్ నాయుడు.. ఇస్రో శాస్త్రవేత్తలు దాన్నే ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

ఇస్త్రో పేరును ఎప్పుడు ప్రస్తావించినా గుర్తుకు వచ్చే గొప్ప వ్యక్తి అబ్దుల్ కలామ్ అని.. చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా ఉన్నప్పుడు అంతటి గొప్ప వ్యక్తి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించినందుకు తాము గర్విస్తున్నట్లుగా పేర్కొన్నారు. తమ అధినాయకుడు చంద్రబాబు మీద అక్రమంగా కేసులు పెట్టి.. ఈ దేశానికి చెందిన రూ.43 వేల కోట్లను దోచుకున్న వారు మాత్రం ఈ నెల 23న పదో బెయిల్ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం సాగుతోందని.. దానికి వ్యతిరేకంగా సభలో ఉన్న వారంతా ముక్త కంఠంతో ఖండించాలని కోరగా.. దీనిపై వైసీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వైసీపీ ఎంపీ అభ్యంతరాల నేపథ్యంలో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. తన ప్రసంగంలో ఎలాంటి అన్ పార్లమెంటరీ పదం ఉన్నా.. తొలగించాలని కోరారు. తాను ఎక్కడా హద్దులు దాటలేదని.. తన పరిధిలోనే మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ అభ్యంతరాలపై స్పందించిన ప్యానల్ స్పీకర్ ప్రేమ చంద్రన్ జెక్యం చేసుకొని వారి వాదనల్ని తోసిపుచ్చారు.