బిగ్ న్యూస్... కేంద్ర కేబినెట్ లోకి ఎర్రన్నాయుడి వారసుడు!
యువ రక్తాన్ని మరింత ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో రామ్మోహన్ నాయుడినే ఫస్ట్ ఆప్షన్ గా చంద్రబాబు ఎంచుకున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 9 Jun 2024 4:46 AM GMTఈ రోజు సాయంత్రం ఢిల్లీలో ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఏ పార్టీకి ఎన్నేసి కేంద్ర మంత్రి పదవులు ఇస్తారనే చర్చ ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా మారిన టీడీపీకి ఎన్ని మంత్రిపదవులు, ఎవరెవరికి ఇవ్వబోతున్నారనేది మరింత చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో రామ్మోహన్ నాయుడి పేరు తెరపైకి వచ్చింది.
అవును... కేంద్రమంత్రి వర్గంలో జేడీయూకి రెండు మంత్రిపదవులు ఇస్తున్నారనే కథనాలు వచ్చిన వేళ... ఏపీలో టీడీపీకి ఎన్ని కేంద్రమంత్రి పదవులు ఇస్తారనే చర్చ ఆసక్తిగా మారింది. ఈ సమయంలో... కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు స్థానం ఖరారైందని తెలుస్తుంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కనుందని తెలుస్తుంది.
వాస్తవానికి ఇది ఎప్పుడో ఊహించిందే అనే అంటున్నాయి టీడీపీ శ్రేణులు. అందుకు చాలా బలమైన కారణాలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్... వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో ఫ్యాన్ గాలి హోరెత్తిన సమయంలో కూడా తట్టుకుని నిలబడ్డారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడు కావడం, ఉత్తరాంధ్రలో పార్టీకి బలమైన యువనేతగా ఉండటం, రెండుసార్లు పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం ఉండటంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలపైనా పట్టు ఉండటంతో పాటు.. యువ రక్తాన్ని మరింత ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో రామ్మోహన్ నాయుడినే ఫస్ట్ ఆప్షన్ గా చంద్రబాబు ఎంచుకున్నారని అంటున్నారు.
ఉత్తరాంధ్రపై చంద్రబాబు కమిట్మెంట్!:
వాస్తవానికి ఉత్తరాంధ్ర విషయంలో చంద్రబాబు ఎప్పుడూ పెద్దమనసుతోనే ఉంటారని అంటారు. ఇందులో భాగంగానే 1996లో యునైటెడ్ ఫ్రంట్ లో ప్రభుత్వంలో టీడీపీ చేరిన సమయంలో లభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రన్నాయుడికి అవకాశం ఇచ్చారు. ఇదే క్రమంలో... 2014లో ఇదే ఎన్డీయే సర్కార్ లోనూ ఉత్తరాంధ్రకే చెందిన అశోక్ గజపతి రాజుకు పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఎంపిక చేశారు.
ఈ క్రమంలోనే మరోసారి ఉత్తరాంధ్రకు చెందిన యువనేతకే కేంద్రమంత్రిగా చంద్రబాబు అవకాశం కల్పించారని.. ఉత్తరాంధ్రపై ఆయనకున్న కమిట్మెంట్ అలాంటిదని అంటున్నారు.
పెమ్మసానికి లక్కీ ఛాన్స్!:
టీడీపీకి ప్రస్తుతానికి వచ్చే రెండు కేంద్రమంత్రి పదవుల్లోనూ ఒకటి రామ్మోహన్ నాయుడికి ఇవ్వగా... మరో పదవిని గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు ఇవ్వబోతున్నారని అంటున్నారు. అయితే ఇది సహాయమంత్రి పదవి అని తెలుస్తుంది. నేడు ప్రధానిగా నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులుగా వీరిద్దరు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం.