Begin typing your search above and press return to search.

నాన్న అడుగు జాడల్లో...ఆయన స్ఫూర్తితో...!

దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు పేరు చెబితే ఉత్తరాంధ్ర పులకరిస్తుంది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 11:49 AM GMT
నాన్న అడుగు జాడల్లో...ఆయన స్ఫూర్తితో...!
X

దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు పేరు చెబితే ఉత్తరాంధ్ర పులకరిస్తుంది. ఆయన పుట్టిన గడ్డ శ్రీకాకుళం ఉప్పొంగుతుంది. విశాఖ ఏయూలో న్యాయ విద్యను అభ్యసించి ముక్కుపచ్చలారని వయసులో రాజకీయాల్లోకి వచ్చి మూడు దశాబ్దాల పాటు అందులో రాణించి కేంద్ర మంత్రిగా ఎదిగిన కింజరాపు ఎర్రన్నాయుడు ఉత్తరాంధ్ర ఆణిముత్యం అని చెప్పాలి.

ఆయనకు వారసులు ఉంటారా అంటే లేరు అనే చెప్పాలి. ఎందుకంటే స్వయంకృషితో ఎర్రన్నాయుడు ఎదిగారు. ఆయన బతికి ఉంటే ఇంకా ఎంతటి ఉన్నత శిఖరాలు అధిరోహించేవారో తెలియదు. కానీ 2012 నవంబర్ 2న ఆయన రోడ్ యాక్సిడెంట్ లో ఆయన మరణించారు. ఆయన 55 ఏళ్ళ వయసులో మరణించారు. అప్పటికి ఆయనకు రాజకీయంగా వారసుడు లేరు.

తమ్ముడు అచ్చెన్నాయుడుని ఆయన ఎమ్మెల్యేగా తన సీటులో ఉంచారు అంతే. కానీ ఎర్రన్నాయుడు ఏకైక కుమారుడు రామ్మోహన్ నాయుడు ఆ బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. కేవలం 12 ఏళ్ళ కాలం గిర్రున తిరిగే సరికి మూడుసార్లు అదే శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి గెలిచి ఏకంగా కేంద్రంలో కేబినెట్ మంత్రి అయ్యారు. తండ్రి స్థానాన్ని అందుకున్నారు. ఎర్రన్నాయుడు తన 49 ఏట కేంద్ర మంత్రి అయితే రామ్మోహన్ నాయుడు 37 ఏళ్ళకే ఆ పదవిని అందుకోవడం గ్రేట్ అనే చెప్పాలి.

మరి ఈ పన్నెండేళ్ల రాజకీయ ప్రస్థానం అంతా ఎలా సాగింది. అదంత సులువైన విషయమా అంటే కానే కాదు అంటారు రామ్మోహన్. ఆయన ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ జీవితం గురించి వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

తనకు జ్ఞానం వచ్చేసరికే ఎర్రన్నాయుడు హరిశ్చంద్రాపురం ఎమ్మెల్యేగా ఉండేవారుట. అలా తండ్రి బిజీ లైఫ్ ని చూసిన రామ్మోహన్ రాజకీయాల్లోకి రావద్దు అనే అనుకున్నారు. ఇక ఎర్రన్నాయుడు సైతం తన కుమారుడిని రాజకీయాల్లో తీసుకుని రావాలనుకోలేదు. దాంతో హైదరాబాద్ ఢిల్లీలలో ఇంటర్ దాకా చదివిన తరువార రామ్మోహన్ ని ఇంజనీరింగ్ విద్య కోసం అమెరికా పంపించారు. అలా ఉన్నత చదువులు చదివిన రామ్మోహన్ కొన్నాళ్ళు సింగపూర్ లో కూడా ఉన్నారు.

ఆ మీదట ఎంబీయే అయ్యాక ఢిల్లీ వచ్చిన ఆయన అక్కడ ఒక ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థలో జాబ్ చేశారు. అక్కడ వ్యాపారం మెలకువలు నేర్చుకుని వ్యాపారవేత్తగా స్థిరపడాలన్నది ఆయన కోరిక. తండ్రి ఆకాంక్ష అదే. అయితే చిత్రంగా ఎర్రన్నాయుడు అదే సమయంలో మరణించడంతో రామ్మోహన్ ఆలోచనలు మారిపోయాయి. తండ్రి మరణవార్త విని చూసేందుకు వచ్చిన అభిమానులు అనుచరులను సాధారణ ప్రజలను చూసిన తరువాత వారిని అండగా ఉండాలని డెసిషన్ తీసుకున్నానని రామ్మోహన్ చెబుతారు.

ఇక చంద్రబాబు ప్రోత్సాహంతో ఆయన శ్రీకాకుళం లోక్ సభకు ఇంచార్జ్ గా ఉండడం 2014లో వచ్చిన ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా గెలిచి ఢిల్లీ పార్లమెంట్ లో అడుపెట్టడం జరిగాయి. ఈలోగా సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజా సమస్యల మీద అవగాహన్ కోసం మొత్తం శ్రీకాకుళం అంతా 7,500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర కూడా రామ్మోహన్ ని జనాలకు మరింత దగ్గర చేసింది.

ఇక 2018లో బీజేపీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు లోక్ సభలో రామ్మోహన్ మాట్లాడిన దానికి మంచి స్పందన లభించింది. అంతే కాదు చాలా సార్లు ఆయన మాట్లాడిన విషయాలను చూసి ప్రధాని మోడీ కూడా మెచ్చుకున్నారు ఇక 2019లో పార్టీ ఓడాక అయిదేళ్ళ పాటు జనంలోనే ఉంటూ వచ్చారు. అదే 2024 లో ఆయన్ని మళ్లీ గెలిపించింది. ఇక ఈసారి మామూలు విజయం కాదు ఏకంగా కేంద్ర మంత్రి గా చేరడం ఎంతో గొప్ప అనుభూతి అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

తండ్రి పనిచేసిన స్థానంలోకి తాను రావడం అంటే అది మరచిపోలేని అనుభవం అని చెబుతారు. తన తండ్రి స్పూర్తితోనే ఇదంతా సాధించాను అని అన్నారు. తన విజయం చూడడానికి తండ్రి లేకపోయినా తనను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వస్తున్న చంద్రబాబే తనకు తండ్రి, గురువు అని రామ్మోహన్ చెబుతారు.

మొత్తానికి ఈ యువ నేత మరిన్ని విజయాలను అందుకుంటారని అంతా ధీమాగా చెబుతారు. అది ఆయన ప్రతిభను చూసి మాత్రమే. ఆయన జాతకాన్ని చూసి ఏ మాత్రం కాదు. దటీజ్ రామ్మోహన్. ఒకనాడు తండ్రి అంటే భయపడే రామ్మోహన్ ఆయనతో అతి తక్కువ సమయం స్పెండ్ చేసిన రామ్మోహన్ ఈ రోజు ఆ తండ్రి కలలను సాకారం చేశారు అంటే ఆయన జీవితం యువతకు ఎంతో స్పూర్తిదాయం అని చెప్పడమే కరెక్ట్.