మరో రెండు నెలల్లో "ఈనాడు" సరికొత్త రికార్డ్... ఈ లోపే...!
అయితే ఆయన మానసపుత్రిక కు మరో రెండు నెలల్లో ఏభై ఏళ్లు పూర్తవబోతుంది. అవును... మరో రెండు నెలల్లో ఈనాడు పత్రికకు 50ఏళ్లు నిండనున్నాయి.
By: Tupaki Desk | 8 Jun 2024 7:27 AM GMT"మీడియా మొఘల్"గా కీరించబడ్డ రామోజీ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈయన మృతిపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే... రామోజీ మానస పుత్రిక "ఈనాడు"కు సంబంధించి ఓ అద్భుత ఘట్టం మరో రెండు నెలల్లో జరగనుంది. ఈ సమయంలో రామోజీ ఆస్తమించారు.
అవును... తెలుగు పత్రికా రంగంలో "ఈనాడు" స్థానం ప్రత్యేకం అనే చెప్పాలి. ఒకప్పుడు మధ్యాహ్నానికి కానీ దినపత్రిక ఇంటికి రాని రోజుల్లో... సూర్యోదయం తర్వాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదనే లక్ష్యంతో ముందుకు కదిలారు రామోజీ రావు. ఈ క్రమంలోనే అప్పటివరకూ బస్సులు, రైళ్లు, తపాలా ద్వారా పత్రికా పంపిణీ సాగుతున్న విధానాన్ని సమూలంగా మార్చేశారు.
ఇందులో భాగంగా... సొంతంగా ప్రైవేటు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మరీ పత్రికను పంపిణీ చేశారు. ఈ విషయంలో సర్యులేషన్ డిపార్ట్మెంట్ ను నిత్యం యాక్టివ్ గా ఉంచేవారు. పబ్లికేషన్ డిపార్ట్మెంట్ ను బిజీ చేసేవారు. ఎవరు ఎన్ని ఇబ్బందుపడ్డా... వినియోగదారుడికి ఉదయాన్ని పత్రికను గుమ్మంలో వేయడమే ప్రధాన లక్ష్యం అని గుర్తుచేసేవారు!
వీటన్నింటికీ తొలి అడుగు పడింది 1974 ఆగస్టు 10. ఆ రోజే విశాఖపట్నంలో రామోజీరావు తన మానసపుత్రిక "ఈనాడు"ను ప్రారంభించారు. అయితే ఆయన మానసపుత్రిక కు మరో రెండు నెలల్లో ఏభై ఏళ్లు పూర్తవబోతుంది. అవును... మరో రెండు నెలల్లో ఈనాడు పత్రికకు 50ఏళ్లు నిండనున్నాయి. ఈ సమయంలో ఆ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే రామోజీరావు కన్నుమూశారు.
కాగా... జర్నలిజంలో విలువలను పెంచడంతోపాటు ఉన్నత ప్రమాణాలను నిలబెట్టే ప్రముఖులకు ఇచ్చిన బి.డి.గోయంకా అవార్డును 2001లో రామోజీరావు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జర్నలిజం, సాహిత్యం, విద్యారంగంలో ఆయన చేసిన సేవలకు గానూ పద్మభూషణ్, పద్మ విభూషణ్ వరించాయి. ఇదే సమయంలో... ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గానూ రామోజీ పనిచేశారు.