కాంగ్రెస్ పునాదులు కదిపేసిన రామోజీ ఒకే ఒక్క ఆలోచన !
చెరుకూరి రామోజీరావు పేరు చెబితే తెలుగు జాతి తలెత్తుకుని చూస్తుంది. విజయ గర్వంతో గెండె బరువెక్కుతుంది
By: Tupaki Desk | 8 Jun 2024 1:24 PM GMTచెరుకూరి రామోజీరావు పేరు చెబితే తెలుగు జాతి తలెత్తుకుని చూస్తుంది. విజయ గర్వంతో గెండె బరువెక్కుతుంది. రామోజీరావు మావాడు అని చాటి చెప్పుకోవడంలో ఉన్న గౌరవాన్ని మనసారా అనుభవిస్తుంది. అక్షర యోధుడుగా ముద్రపడిన రామోజీరావు 88 ఏళ్ల వయసులో తనువు చాలించారు. జాతస్య మరణం ధ్రువం అన్న భగవద్గీతా సారం ప్రకారం పుట్టిన వారు ఏదో నాడు అస్తమించక తప్పదు.
కానీ తాను పుట్టిన నేలకు పంచిపోయిన అసలైన ఆస్తి ఏమిటి అన్నది తరచి చూసుకుంటే కొందరే మహానుభావులుగా అలా మిగులుతారు. అందులో శ్రేష్టునిగా రామోజీరావుని పేర్కొనాలి. ఆయన ఏ సంస్థ స్థాపించిన అందులో అశేష కోటి ప్రజానీకం ఆశలు ఆకాంక్షలు నెరవేరాయా లేదా అనేదే కొలమానంగా చూసుకునే వారు.
ఆయన ఈనాడు స్థాపనకు ముందు కూడా ఎన్నో పత్రికలు ఉన్నాయి. అప్పటికే అర్ధ శతాబ్దం పైగా కొనసాగుతూ వస్తున్న పెద్ద పత్రికలు ఎన్నో ఉన్నాయి. ఆ సమయంలో రామోజీరావు సాహసించి ఈనాడుని సంస్థాపించారు. అలా ఈనాడు ఇంతింతై వటుడింతే అన్నట్లుగా తెలుగు నాట వర్ధిల్లింది. ఈనాడులో వచ్చిన వార్త అంటే గెజిట్ నోటిఫికేషన్ కంటే ఎక్కువ క్రెడిబిలిటీ ఉందని పేరు తెచ్చుకుంది. అలా చేయడంలో రామోజీరావు పట్టిన అక్షరధారా వ్రతం ఎనలేనిది. ఎవరి వల్లా మళ్లీ కానిది అని చెప్పడంలో సందేహమే లేదు.
ఈనాడు పత్రిక నాడు ఎమర్జెన్సీని వ్యతిరేకించింది. పత్రిక పుట్టి ఏడాది కాకుండానే వచ్చి పడిన అత్యవసర పరిస్థితి మీద ఈనాడు కళం విప్పిన నిరసన గళం జాతిని జాగృతం చేసింది. ఆ తరువాత దేశంలో ఉమ్మడి ఏపీలో వచ్చిన రాజకీయ మార్పులకు అనుగుణంగా ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా ఈనాడు తన కలాన్ని ఝళిపించింది. 1978లో ఏర్పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన వింత పోకడలు చూసిన ఈనాడు ఏకంగా ఆనాడు ప్రతిపక్ష అవతారమే ఎత్తింది.
అప్పట్లో కాంగ్రెస్ కి సరైన విపక్షం లేదు. ఆ బాధ్యతను తనదిగా తీసుకుని ఈనాడు సాగించిన అక్షర సమరం తోనే తెలుగు నాట రాజకీయ శూన్యత ఏర్పడేలా చేసింది. అలా తెలుగుదేశం వంటి కొత్త పార్టీ పురుడు పోసుకోవడానికి నిలిచి గెలవడానికి కూడా ఈనాడు కారణం అయింది అని చెప్పాల్సి ఉంది.
అలా చూస్తే కనుక ప్రజలను గాలికి వదిలేసి క్యాంప్ రాజకీయాలు చేయడం ముఖ్యమంత్రులను తరచూ మార్చడం వంటివి ఆ అయిదేళ్లలో సాగాయి. వాటిని ఎప్పటికపుడు ప్రజలకు చేరవేయడంలో ఈనాడు పోషించిన పాత్ర కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత కలిగేలా చేసింది. ఇదిలా ఉంటే అదే టైం లో రాజీవ్ గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీకి రావడం ఆయన బేగం పేట ఎయిర్ పోర్టులో అప్పటి కాంగ్రెస్ సీఎం గా ఉన్న అంజయ్యను అవమానించారు అన్న వార్తను చాలా ఒడుపుగా ఈనాడు ఒడిసి పట్టుకుంది.
దానినే బ్యానర్ గా చేసి తెలుగు వారి ఆత్మ గౌరవం అంటూ తొలిసారి ఒక వజ్రాయుధం లాంటి నినాదాన్ని ఇచ్చిన ఘనత ఈనాడు రామోజీరావుకే దక్కుతుంది. తెలుగు వారి ఆత్మ గౌరవం అన్న మాట రామోజీరావు మెదడులో నుంచి పుట్టిన ఆలోచన. అదే నిప్పు కణిక అయింది. అదే టీడీపీకి అద్భుతమైన ఆయుధంగా మారింది. ఆ మీదట ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు ఇదే నినాదంతో జనంలోకి దూసుకుని వెళ్లారు. తెలుగుదేశం వంటి కొత్త పార్టీకి ఈనాడు అతి పెద్ద బలంగా మారింది. అగ్నికి వాయువు తోడు అన్నట్లుగా సాగిన ఆ అపూర్వ కలయికలో తెలుగు జాతి చైతన్యమూర్తిమంతం అయింది.
ఫలితంగా 1983లో జరిగిన ఎన్నికల్లో అప్పటికి మూడున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలన కొట్టుకుని పోయింది. తెలుగుదేశం కేవలం తొమ్మిది నెలలలోనే 200 సీట్లు సాధించి అన్న గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. అలా కాంగ్రెస్ ని కూలదోయడంలో ఈనాడు దాని అధినేత రామోజీరావు ఆలోచనలు ఆయన ఇచ్చిన నినాదమే కారణం అని గట్టిగా చెప్పవచ్చు.