Begin typing your search above and press return to search.

జర్నలిస్టుల త్రయంబకం... "ఈనాడు జర్నలిజం స్కూల్"!

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jun 2024 10:02 AM GMT
జర్నలిస్టుల త్రయంబకం... ఈనాడు జర్నలిజం స్కూల్!
X

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన మృతికి సంతాపం పలుకుతున్నారు. ఆయన మృతి యావత్ దేశానికి తీరని లోటని పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా రామోజీ సృష్టించిన అద్భుతాల గురించిన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ అద్భుతాల్లో ఒకటి "ఈనాడు జర్నలిజం స్కూల్" ఆసక్తికర అంశం.

అవును... రామోజీరావు ఎన్నో అద్భుతాలను సృష్టించారు.. ఎన్నో ఘనవిజయాలను సాధించారు. అయితే... ఆయన సృష్టించిన అద్భుతాల్లో చాలా మందికి నచ్చింది.. తమ జీవితాలను పలువురు మెచ్చేలా చేసింది.. అంతకంటే ముందు తమ జీవితాలను తామే మెచ్చుకునేలా తీర్చిదిద్దింది మాత్రం "ఈనాడు జర్నలిజం స్కూల్" అని చెప్పే జర్నలిస్టులే ఎక్కువ అని చెప్పినా అతిశయోక్తి కాదు.

ఈరోజు ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న పత్రికలు, న్యూస్ ఛానళ్లు, వెబ్ సైట్ లు, న్యూస్ యాప్ లు, యూట్యూబ్ ఛానళ్లలో వర్క్ చేసే మెజారిటీ సబ్ ఎడిటర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, డెస్క్ ఇన్ ఛార్జ్ లు, చీఫ్ ఎడిటర్లు, బ్యూరో ల ప్రస్థానం ఈ.జే.ఎస్. (ఈనాడు జర్నలిజం స్కూల్) అని చెప్పడానికి ఎవరికీ ఎలాంటి మొహమాటం, అభ్యంతరం ఉండకపోవచ్చు.

గోదావరి నదికి పుట్టుక త్రయంబకం ఎలాగో.. పత్రికా రంగంలోకి రామోజీ ఎంట్రీ అనంతరం తెలుగు జర్నలిస్టులకు పుట్టుక ఈజేఎస్ అనే చెప్పాలి! 1990లో ప్రారంభమైన ఈ ఈనాడు జర్నలిజం స్కూల్ ఎందరో జర్నలిస్టులను తయారుచేసింది. అక్కడే ట్రైనింగ్.. అనంతరం ప్రొబిషన్, ఫైనల్ గా కన్ ఫర్మేషన్! ఈ క్రమం దాదాపు ఈజేఎస్ బ్యాచ్ అందరికీ విదితమే!

"అక్షరానికి సామాజిక ప్రయోజనం కల్గించే పత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా? సామాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకూంటే... ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే. కొత్త తరం పాత్రికేయుల్ని తీర్చి దిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాం" అంటూ ఈజేఎస్ విడుదల చేసే ప్రకటనకి వేలల్లో దరఖాస్తులు వస్తుంటాయి.

ఎంట్రన్స్ పరీక్షలో పాస్ అయితే.. ఏడాది పాటు శిక్షణ, శిక్షణ సమయంలో స్టైఫండ్.. అనంతరం ప్రొబిషన్ తర్వాత కన్ ఫర్మేషన్! రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఈనాడు జర్నలిజం స్కూల్ లోకి విద్యార్థిగా ఎంట్రీ ఇచ్చి... బయటకు సబ్ ఎడిటర్ గా, స్టాఫ్ రిపోర్టర్ గా వచ్చి, ఈ రోజు సమాజంలో ఎంతో పేరున్న ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా, న్యూస్ ప్రజెంటేటర్లుగా, విశ్లేషకులుగా.. ఆనాక రాజకీయ నాయకులుగా మారినవారు ఎందరో...!