Begin typing your search above and press return to search.

రామోజీ.. వెళ్లిపోయారా? శోకంతో తెలుగుజాతి గుండెబద్ధలు

అయితే.. తన మీడియా సంస్థలతో పాటు.. వివిధ రంగాలకు తన వ్యాపారాల్ని విస్తరించిన ఆయన వేలాది మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించారు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 4:34 AM GMT
రామోజీ.. వెళ్లిపోయారా? శోకంతో తెలుగుజాతి గుండెబద్ధలు
X

ఒక వ్యక్తి అందరికి నచ్చాలని లేదు. అందరికి నచ్చకూడదని లేదు. కానీ.. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు మాత్రం ఈ రెండింటికి మినహాయింపు. ఆయన్ను అభిమానించే వారు..ఆరాధించే వారు కోట్లాదిమంది ఉన్నారు. అదే సమయంలో ఆయన్ను విమర్శించేవారు.. తప్పు పట్టేవారు ఉన్నారు. అయితే.. ఇంకెవరికి లేని గొప్పతనం ఏమంటే.. ఆయన్ను కోపగించుకునే వారు సైతం కొన్ని అంశాల్లో రామోజీరావును విపరీతంగా అభిమానిస్తారు. ఆయన భావజాలాన్ని ప్రశ్నించేవారు.. విమర్శించే వారు సైతం ఆయన మాటల్ని విశ్వసిస్తారు. ఆయన మీడియా సంస్థలో వచ్చిన వార్తల్ని.. ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం గుడ్డిగా నమ్మేస్తారు. అదీ.. ఆయన గొప్పతనం. అదీ ఆయన వ్యక్తిత్వం.

విశ్వసనీయత గురించి ఇవాల్టి రోజున చాలామంది చాలానే చెబుతారు. కానీ.. రామోజీరావు పేరుకు.. ఆయన సంస్థలకున్న విశ్వసనీయతను ఎవరు వేలెత్తి చూపలేదు. ఇందాక చెప్పినట్లుగా సైద్ధాంతికంగా.. రాజకీయంగా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం వ్యక్తిగతంగా ఆయన్ను అభిమానిస్తారు. అంతకు మించి ఆరాధిస్తారు. అదే ఆయన గొప్పతనం. తొంభై దశకం వరకు తెలుగు నేల మీద ఉపాధి అవకాశాలు ఎంత తక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ వచ్చిన తర్వాత తెలుగువారికి ఉపాధి అవకాశాలు పెరిగాయి.

అయితే.. తన మీడియా సంస్థలతో పాటు.. వివిధ రంగాలకు తన వ్యాపారాల్ని విస్తరించిన ఆయన వేలాది మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించారు. దేశంలో మీడియా సంస్థలు బోలెడు ఉండొచ్చు. కానీ.. అప్పటికి ఇప్పటికి.. ఎప్పటికీ మీడియా మొఘల్ అన్న బిరుదు మాత్రం ఆయనకు మాత్రమే చెల్లు. మన దేశంలో మరే మీడియా అధినేతకు లేని పేరు ప్రఖ్యాతులు.. గౌరవ మర్యాదలు ఆయనకే సొంతం. పాలకులు ఎవరైనా సరే ఆయన్ను కలుసుకోవాలే కానీ.. ఆయన కలుసుకోవటానికి పెద్ద ఆసక్తి చూపరు.

ఎంత ఎత్తు ఎదిగినా తన పరిధి.. పరిమితి బాగా తెలిసిన వ్యక్తి రామోజీ. తనకున్న పరిచయాలు.. పరపతితో వ్యాపార ప్రపంచంలో దూసుకెళ్లొచ్చు. వేలాది కోట్లు ఇట్టే సంపాదించొచ్చు. కానీ.. అలాంటివి చేయకుండా తన వ్యాపారాలకు తానే పరిమితులు విధించుకోవటం కనిపిస్తుంది. ఎన్ని సంస్థలు ప్రారంభించామన్న దాని కంటే ఎంత క్రమశిక్షణగా నడిపామన్న దానికే ప్రాధాన్యత ఇస్తారు. విలువలతోకూడిన వ్యాపారం చేయాలన్న సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతారు. మీడియా.. ఇవాల్టి రోజున వ్యాపారమైంది కానీ.. రామోజీ దాన్ని ఎప్పుడూ వ్యాపార వస్తువుగాచూడలేదు.

సామాజిక చైతన్యానికి.. తెలుగు ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు.. తెలుగు ప్రజలు మరిన్ని ఉపాధిఅవకాశాల్ని సొంతం చేసుకోవటంతో పాటు.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు పూయాలన్న ఆశ ఆయనలో ఎక్కువ. అందుకే.. తన అవసరం ఉందనిపించిన ప్రతి విపత్తులోనే ఆయన ముందుండటం అపన్నహస్తాన్ని అందించటం కనిపిస్తుంది. సామాజిక చైతన్యం కోసం ఉద్యమాల్ని నడిపిన ధీరత్వం ఆయన సొంతం. ఆయన జీవితం మొత్తం పోరాటమే. అయినా ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నమ్మిన విషయానికి మొండిగా ముందుకు వెళ్లటమే తప్పించి.. తగ్గటం అన్నది ఆయన జీవితంలో కనిపించదు.

రాజకీయంగా ఆయన తీసుకున్న స్టాండ్ కొందరికి కొంత నచ్చకపోవచ్చు. అయినప్పటికీ ఆయన్ను వ్యక్తిగతంగా అభిమానిస్తారు. ఆయన్ను మైకుల ముందు తిట్టినోళ్లు సైతం.. వ్యక్తిగతంగా మాత్రం ఆయన్ను మాట అనటం తమకు ఇబ్బందిగానే ఉందని.. తప్పని పరిస్థితుల్లో అంటున్నామంటూ పెద్ద పెద్ద నేతలు ఈనాడు సంస్థల ఉద్యోగులతో రిక్వెస్టు చేయటం లాంటి ఇమేజ్ ఆయనకు మాత్రమే సాధ్యం.

రామోజీకి తెల్లవారుజాము అంటే ఇష్టం. తెల్లటి వస్త్రాల్ని ధరించటం మహా ఇష్టం. వైట్ అండ్ వైట్ లో కనిపించే ఆయన.. సందర్భం ఏదైనా సరే.. ఆ దుస్తుల్ని విడిచి వేరేగా కనిపించటం ఉండదు. అది ఆయన కమిట్ మెంట్. జర్నలిస్టులకు ఆయన ఒక పెద్ద బాలశిక్ష. ఆయన సంస్థలో పని చేసిన ఉద్యోగి ఎవరైనా సరే.. పని వచ్చిందన్న సర్టిఫికేట్ పొందినట్లే. ఈనాడులో పని చేశాడంటే చాలు.. కళ్లకు అద్దుకొని పనికి పెట్టుకునే గ్యారెంటీ ఆయన సంస్థకు మాత్రమే ఉంది. ఆయన జీవితంలో ఏ రోజు కూడా సూరీడు వచ్చిన తర్వాత నిద్ర లేచింది ఉండదు.

తెల్లవారుజామున తన ఈనాడు దినపత్రికను అసాంతం చదివి.. దాని మీద కామెంట్లు రాసిన తర్వాతే వేరే ఏ పనైనా చేస్తారు. ఇందుకోసం ఆయన గంటన్నర సమయాన్ని వెచ్చిస్తారు. ఎంత పనిలో ఉన్నా.. మరెంత బిజీగా ఉన్నా ఆయన ఆ అలవాటుకు దూరం కారు. ప్రింటిగ్ అయిన మొదటి కాపీల్లో ఒక దానిని ఆయన టేబుల్ మీద సిద్దంగా ఉంచుతారు. ఆయన టేబుల్ మీదకు పేపర్ వచ్చేసరికి ఆయన చదివేందుకు సిద్ధంగా ఉంటారు. పత్రిక మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు.. చదివిన తర్వాతే ఆయన మిగిలి పనుల్ని మొదలు పెడతారు.

తెలుగు మీడియా రంగంలో చోటు చేసుకున్న ఎన్నో మార్పులకు ఆయనే ఆద్యుడు. ట్రెండ్ సెట్ చేయటం ఆయనకు అలవాటు. ఆయన్ను చూసి స్ఫూర్తి పొందినోళ్లు కోట్లాది మంది ఉన్నారు. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండే తత్త్వం ఆయన సొంతం. ఒక ఉన్నతస్థానంలో ఉండి ఎంత మర్యాదపూర్వకంగా ఉండాలన్నది ఆయనకు మాత్రమే సాధ్యం. ముఖ్యమంత్రుల్ని సైతం కనుసైగతో శాసించే స్థాయిలో ఉండి కూడా.. అహాన్ని ప్రదర్శించని తత్త్వం రామోజీ సొంతం. ఆయన్ను వ్యక్తిగతంగా కలిసినా.. ఆయన మర్యాదల్ని ఒక్కసారి చవి చూసినా జీవితంలో మర్చిపోలేని విధంగా అతిధ్యం ఇవ్వటం ఆయన సొంతం.

మీడియా రంగంలో కావొచ్చు.. ఆయన నిర్వహించే మిగిలినవ్యాపారాల్లో కావొచ్చు. ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పని చేయటం.. పనిలోనే విశ్రాంతిని వెతుక్కోవటం ఆయనకే చెల్లుతుంది. ఒక విషయానికి ఒకసారి కమిట్ అయితే అదెంత కష్టమైనా.. మరెంత నష్టమైనా వెనక్కి తగ్గని మొండితనం ఆయన సొంతం. అందుకు నిలువెత్తు నిదర్శనం రామోజీ ఫిలింసిటీ. తెల్లఏనుగు లాంటి ఫిలింసిటీని దేశంలో మరే కుబేరుడు స్టార్ట్ చేసినా.. ఈపాటికి నష్టాల బాట పట్టేవారు. ఆస్తుల్ని కోల్పోయేవారు. తెలుగు ప్రజలకు గుర్తింపు చిహ్నంగా రామోజీ ఫిలింసిటీని నిర్మించిన ఆయన.. దాని కోసం ఆయన ఎంతగా శ్రమించారో కొందరికే తెలుసు.

గద్దలు గుడ్లుపెట్టటానికి సైతం వెనుకాడే గుట్టల్ని పిండి చేసి.. అత్యద్భుతమైన.. ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని నిర్మించిన ఘనత రామోజీ సొంతం. రామోజీ ఫిలిం సిటీని సందర్శించే వారంతా అక్కడి క్రమశిక్షణకు.. పద్దతికి ఫిదా అయిపోతుంటారు. అంత పెద్ద వ్యవస్థను నడిపిస్తూ కూడా.. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఉండేలా చేయటం రామోజీకే సొంతం. మార్గదర్శి లాంటి చిట్ ఫండ్ నుస్టార్ట్ చేసి.. దశాబ్దాలుగా ఎలాంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండటటం ఆయనకే సాధ్యం.

మార్గదర్శి వ్యాపారం మీద కొన్ని విమర్శలు రావొచ్చు. కానీ.. ఆ సంస్థలో డబ్బుల్ని దాచుకున్న వారు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నష్టపోయామన్న మాటను చెప్పలేని పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. ఆ సంస్థ మీద ఫిర్యాదు ఇవ్వటానికి ఒక్కరంటే ఒక్క వినియోగదారుడు ముందుకు రాలేకపోవటం లాంటివి చూస్తే.. ఆయన తన వ్యాపారాల్ని ఎంత క్రమశిక్షణ నిర్వహిస్తారన్నది అర్థమవుతుంది. తెలుగువారికి గుర్తింపు తెచ్చి పెట్టిన కొద్ది మందిలో రామోజీ రావు ఒకరు. తాను ఎదుగుతూ.. తన చుట్టూ ఉన్న వారిని మాత్రమే కాదు సమాజాన్ని మార్చాలన్న ఆలోచనతో అడుగులు వేసిన రామోజీ నడక ఈ రోజుతో ఆగింది. ఇప్పటి నుంచి ఆయన గతం. ఒక చరిత్ర. అయినప్పటికీ ఆయన ఆశలు.. ఆశయాలు మాత్రం ఎప్పటికి తెలుగుజాతిలో సజీవంగా ఉంటాయని చెప్పక తప్పదు. అలుపెరగని అక్షరయోధుడికి 'తుపాకీ' నివాళి.