రామోజీరావు అసలు పేరు అది కాదా?
ఈనాడు ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 8 Jun 2024 1:40 PM GMTఈనాడు ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామోజీరావు కెరీర్ గురించి ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రైతుబిడ్డ రామోజీరావు..మీడియా టైకూన్ గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శప్రాయం. ఈనాడు వ్యవస్థాపకుడిగా సుపరిచితుడైన రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియ పచ్చళ్లు, కళాంజలి డ్రస్సెస్, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ఎన్నో వ్యాపారాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు. రామోజీ రావు సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో ఆయనను దేశపు రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తో సత్కరించింది.
రామోజీ రావు బాల్యం
కృష్ణా జిల్లాలోని పెదపరుపూడిలో 1936 నవంబరులో ఓ సాధారణ రైతు కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి వెంకట సుబ్బమ్మలకు రామోజీ రావు జన్మించారు. రామోజీరావుకు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మలు సోదరీమణులు. రామోజీ రావు పూర్వీకులు పామర్రులోని పెరిసేపల్లి గ్రామానికి చెందిన వారు. రామోజీరావు తాతయ్య రామయ్య పెరిసేపల్లి నుంచి పెదపరుపూడికి వలస వెళ్లారు. ఆయన చనిపోయిన 13 రోజుల తర్వాత రామోజీరావు పుట్టారు. అందుకే, ఆయనకు తాతయ్య పేరు రామయ్యను పెట్టాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.
రామోజీ రావు విద్య, వివాహం
స్కూలులో చేరే సమయంలో తన తాత పేరు రామయ్య నచ్చకపోవడంతో తన పేరును రామోజీ రావు అని ఆయనే మార్చుకున్నారు. ఆ తర్వాత జీవితాంతం ఆయనకు రామోజీరావు అనే పేరు కొనసాగింది. 1947లో గుడివాడలోని పురపాల్ కొన్నాట పాఠశాలలో 8వ తరగతిలో రామోజీరావు చేరారు. గుడివాడలోని కాలేజీలో ఇంటర్మీడియట్, బీఎస్సీ పూర్తిచేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల కుమార్తె రమాదేవిని రామోజీరావు వివాహమాడారు. రామోజీ రావు బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ముసునూరు అప్పారావు డాల్ఫిన్ హోటల్స్ ఎండీగా పనిచేశారు.
1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఈనాడు మొదలుబెట్టిన నాలుగేళ్లలోనే లక్షలాది మంది పాఠకుల అభిమానాన్ని చూరగొంది. ఈనాడు దిన పత్రి, ఈటీవీ ఛానెళ్లు, ఈటీవీ న్యూస్ ఛానెళ్ల ద్వారా తెలుగు ప్రజలకు రామోజీరావు ఎనలేని సేవలందించారు. ఈ ఏడాది ఆగస్టు 10న ఈనాడు 50వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించారు. కానీ, ఇంతలోనే హఠాత్తుగా రామోజీరావు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.