ఏపీ ఫలితాలు విడుదలైన రోజున రామోజీ అంతసేపు రివ్యూ చేశారట
ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4న తమతో గంటన్నర పాటు రామోజీరావు రివ్యూ నిర్వహించినట్లుగా డీఎన్ ప్రసాదన్ పేర్కొన్నారు.
By: Tupaki Desk | 1 July 2024 4:58 AM GMTమీడియా మొగల్.. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు సంబంధించిన ఆసక్తికర వివరాల్ని వెల్లడించారు ఆ సంస్థల్లో కీలకమైన ఈనాడుకు తెలంగాణ ఎడిటర్ గా వ్యవహరించే డీఎన్ ప్రసాద్. తాజాగా రామోజీరావు సంస్మరణ సభను హైదరాబాద్ లోని గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ లో ఏర్పాటు చేశారు. వాకర్స్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు ఘనతను.. ఆయన వ్యక్తిత్వాన్ని కీర్తించారు. పలువురు ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో రామోజీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మిగిలిన అందరి ప్రసంగాల కంటే కూడా ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ చేసిన ప్రసంగంలో ఒక అంశం ఆసక్తికరమైనదిగా చెప్పాలి. రామజీరావు క్రమశిక్షణ.. సమయపాలన.. పట్టుదల.. చట్టాన్ని గౌరవించే అంశాల్లో ఆయన ముందుటారని.. చేసే ప్రతి పని చట్టబద్ధంగా చేయాలని భావించేవారని చెప్పారు. ప్రపంచంలో మార్పు అన్నది మాత్రమే శాశ్వితమని నమ్మే వ్యక్తిగా ఆయన్ను అభివర్ణించారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4న తమతో గంటన్నర పాటు రామోజీరావు రివ్యూ నిర్వహించినట్లుగా డీఎన్ ప్రసాదన్ పేర్కొన్నారు. ఆ సందర్భంలోనూ ఆయన మానసిక పరిస్థితి ఎంతో బలంగా ఉన్నట్లు చెప్పారు. ఫలితాలు వెల్లడవుతున్న వేళలో.. తమతో మాట్లాడిన రామోజీరావు.. ‘‘ఇకపై మనం మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది. ప్రజాపక్షమే ఈనాడు ధ్యేయం. ఇందుకు తగ్గట్లే మన నిర్ణయాలు ఉండాలి’’ అంటూ తమకు హితబోధ చేసినట్లుగా వెల్లడించారు.
ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజున తన మనమలుతో మాట్లాడిన రామోజీ.. ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపుపై వ్యాఖ్యలు చేయటం.. జగన్ ఓటమిపై తన మనసులోని మాటల్ని తమ వారసులతో వెల్లడించిన విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అదే సమయంలో.. ఫలితాల వేళ.. ఎడిటోరియల్ విభాగంతో గంటన్నర పాటు రివ్యూ చేసిన కొత్త విషయం వెల్లడైంది. మొత్తంగా ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో రామోజీ ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారన్నది తాజాగా బయటకు వచ్చిన ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.