Begin typing your search above and press return to search.

రామోజీ విగ్రహం చేయిస్తున్న టీడీపీ ఎంపీ.. ప్రతిష్టాపన ఎక్కడంటే..?

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Jun 2024 8:39 AM GMT
రామోజీ విగ్రహం చేయిస్తున్న టీడీపీ  ఎంపీ.. ప్రతిష్టాపన ఎక్కడంటే..?
X

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఫిల్మ్ సిటీలోనే జరిగాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. రామోజీ పాడె మోసి తన బంధాన్ని, స్నేహాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా రామోజీ విగ్రహం రూపుదిద్దుకుంటుంది.


అవును... ఈనాడు అధినేత రామోజీరావు విగ్రహం ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో రూపుదిద్దుకుంటోంది. ఈ మేరకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ విగ్రహాన్ని తయారుచేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహానికి ప్రముఖ శిల్పి రాజకుమార్ వడయార్ తుది మెరుగులు దిద్దుతున్నారు.

ఈ క్రమంలో ఈ విగ్రహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోనో, హైదరాబాద్ లోని ఈనాడు కార్యాలయం ముందో ప్రతిష్టిస్తున్నారని అనుకుంటే తప్పులో కాలేసినట్లే సుమా!! రామోజీ “ఈనాడు” ప్రస్థానం మొదలైన విశాఖపట్నంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. రామోజీ గురించి భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ విగ్రహ ఏర్పాటని అంటున్నారు.

ఈ విగ్రహాన్ని 60ఏళ్ల వయసులో రామోజీ ఎలా ఉండేవారో అలా తయారు చేయించారు. సుమారు ఏడున్నర అడుగుల ఈ విగ్రహాన్ని కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి రూపు తీసుకొచ్చారు. ప్రస్తుత ఎంపీ, ఒకప్పటి ఈనాడు రిపోర్టర్ అయిన అప్పలనాయుడు తాజాగా ఈ విగ్రహాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా స్పందించిన అప్పలనాయుడు... తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరోపక్క... తెలుగువారి స్పూర్తి ప్రదాత రామోజీరావు విగ్రహం తయారుచేసే భాగ్యం తనకు దక్కడం అదృష్టమని శిల్పి రాజ్ కుమార్ వడయార్ తెలిపారు.

కాగా... ఈ నెల 8న రామోజీరవు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... నవంబర్ 16న రామోజీరావు 89వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 25 చోట్ల విగ్రహాలు పెట్టాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.