అన్న కొడుక్కి.. కేసీఆర్ 'మహా' బాధ్యతలు
కేసీఆర్ అన్న రంగారావుకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. కూతురు రమ్యారావు కాంగ్రెస్‌లో కొనసాగుతుండడం గమనార్హం
By: Tupaki Desk | 29 July 2023 7:12 AM GMTకల్వకుంట్ల కుటుంబం నుంచి మరో నేతకు కీలక బాధ్యతలు దక్కాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో సహా ఆ కుటుంబం నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీ.. ఇలా చాలా మందే ప్రజాప్రతినిధులు ఉన్నారు. దీంతో కల్వకుంట్ల కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. కుటుంబ పార్టీ పెత్తనానికి తెరదించాలని నినదిస్తున్నాయి.
కానీ ఇవేమీ పట్టించుకోని కేసీఆర్.. తన కుటుంబం నుంచి మరో నేతను బరిలో దించారు. తన అన్న రంగారావు తనయుడు కల్వకుంట్ల వంశీధర్‌రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇంఛార్జీగా వంశీధర్ రావును నియమించారు.
కేసీఆర్ అన్న రంగారావుకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. కూతురు రమ్యారావు కాంగ్రెస్‌లో కొనసాగుతుండడం గమనార్హం. మరో కుమారుడు కన్నారావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చిరంజీవి అభిమాని అయిన వంశీధర్ రావు 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టడం విశేషం.
మధ్యలో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇటీవల కేసీఆర్‌కు దగ్గరయ్యారు. దీంతో సిద్ధిపేట నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆయన్ని.. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంఛార్జీగా నియమించారు.
మహారాష్ట్రలో పార్టీ విస్తరణలో భాగంగా ఇంఛార్జీతో పాటు 15 మంది సభ్యులతో కేసీఆర్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్‌లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడేమో స్టీరింగ్ కమిటీ ఏర్పాటుతో కేసీఆర్ జోరు పెంచారు. మరోవైపు మహారాష్ట్రలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి కావొస్తోంది.