Begin typing your search above and press return to search.

తండ్రి ఆశయం కోసం.. సైకిల్‌పై ప్రపంచ పర్యటన

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్యాషన్ ఉంటుంది. కొందరికి తీర్థయాత్రలంటే ఇష్టం. కొందరికి ట్రెక్కింగ్‌లు అంటే ఇష్టం.

By:  Tupaki Desk   |   14 Dec 2024 3:30 PM GMT
తండ్రి ఆశయం కోసం.. సైకిల్‌పై ప్రపంచ పర్యటన
X

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్యాషన్ ఉంటుంది. కొందరికి తీర్థయాత్రలంటే ఇష్టం. కొందరికి ట్రెక్కింగ్‌లు అంటే ఇష్టం. మరికొందరికి విదేశాలను చుట్టిరావడం అంటే ఇష్టం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అభిరుచులు ఉంటుంటాయి. కానీ.. ఈ యువకుడికి మాత్రం సైకిల్‌పై యాత్ర చేయడాన్ని అభిరుచిగా మలచుకున్నాడు. సైకిల్‌పైనే కేవలం నాలుగేళ్లలోనే ఏకంగా 41,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి రికార్డు క్రియేట్ చేశాడు.

ప్రపంచాన్ని చుట్టి రావాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ.. కొందరు మాత్రమే దానిని సాకారం చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారిలో ఈ రంజిత్ కుమార్ కూడా ఒకరు. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన రంజిత్ కుమార్ మధ్యతరగతికి చెందిన యువకుడు. ఆర్థిక కష్టాల నడుమ తండ్రి ప్రోత్సవాహంతో ఎం ఫార్మసీ పూర్తిచేశాడు. రంజిత్ తండ్రి రాములు న్యాయవాదిగా పనిచేసేవారు. ప్రపంచ దేశాలు తిరిగి రావాలన్న తన చిరకాల కోరిక కోసం డబ్బులు దాచుకున్నాడు. కానీ.. కొడుకు చదువు కోసం వాటన్నింటినీ ఖర్చు చేశాడు. కొడుకు కోసం తన కోరికను చంపుకున్నాడు. 2020లో అందరి జీవితాల్లోనూ అంధకారం నెలకొల్పిన కరోనా మహమ్మారికి రంజిత్ తండ్రి రాములు కూడా బలయ్యాడు.

దీంతో రంజిత్ జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టివేయబడింది. అదే సమయంలో తన తండ్రి చిరకాల కోరిక అతడికి గుర్తొచ్చింది. దేశ మొత్తం చుట్టి రావాలన్న తండ్రి రాములు ఆశయాన్ని నెరవేర్చేందుకు వెంటనే సైకిల్‌పై భారత్ యాత్రకు పూనుకున్నాడు. 2021లో రంజిత్ తన సైకిల్ యాత్రను ప్రారంభించాడు. ముందు వరంగల్ నుంచి కన్యాకుమారి వరక యాత్ర మొదలు పెట్టాడు. రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు సైకిల్ తొక్కినట్లు రంజిత్ తెలిపాడు. ప్రయాణం ప్రారంభించిన కొన్ని రోజులకే మళ్లీ కరోనా విజృంభించడంతో రోడ్లపక్కనే పెట్రోల్ బంకుల్లో, స్థానిక పాఠశాలల్లోనే సేద తీరుతూ ముందుకు సాగాడు. అలా 15 రోజుల్లో 1,500 కిలోమీటర్లు ప్రయాణించి కన్యాకుమారికి చేరుకున్నాడు.

అక్కడి నుంచి అరేబియా సముద్రం పక్కనే దక్షిణ పశ్చిమ కోస్తా తీరం వెంబడి గోవాకు చేరుకున్నాడు. మరికొన్ని యూరప్ దేశాలలోనూ పర్యటించాడు. రంజిత్ ఆన్ వీల్స్ అనే పేరుతో యూట్యూబ్ చానల్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు తన వీడియోలను అప్డేట్ చేస్తున్నాడు. లాక్‌డౌన్‌లో సోనూసూద్ చేసిన దాతృత్వం పనులను మెచ్చి ఆయనను కలిసేందుకు ముంబై కూడా వెళ్లాడు. రంజిత్ తన కోసం ముంబై వచ్చాడని తెలుసుకున్న సోనూసూద్ వెంటనే తన హైదరాబాద్ పర్యటనను ముగించుకొని ముంబైకి వచ్చారు. రంజిత్ చేస్తున్న యాత్రను చూసి అభినందించారు. అయితే..ఈ యాత్రలో రంజిత్ తాను ఒక్కడే కాకుండా తన వెంట ఓ కుక్కను సైతం వెంటబెట్టుకొని వెళ్తున్నాడు.

సైకిల్‌పై పక్క ఊరికి కూడా వెళ్లలేని ప్రస్తుత పరిస్థితిలో వరంగల్‌కు చెందిన రంజిత్ ఏకంగా 41,400 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇప్పటివరకు ఆయన 13 దేశాల్లో పర్యటించాడు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు రంజిత్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు.