పలు బ్యాంకులపై ర్యాన్సమ్ వేర్ దాడి.. రాయిటర్స్ ఏం చెప్పింది?
ఆర్థిక సంస్థలకు బ్యాంకింగ్ టెక్నాలజీ సిస్టమ్ లు అందించే సి - ఎడ్జ్ టెక్నాలజీస్ పై దాడికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు
By: Tupaki Desk | 1 Aug 2024 6:07 AM GMTసంచలన విషయాల్ని వెల్లడించింది రాయిటర్స్ కథనం. మన దేశంలోని దాదాపు 300లకు పైగా బ్యాంకులపై ర్యాన్సమ్ వేర్ దాడి జరిగినట్లుగా పేర్కొంది. ఈ కారణంగా.. భారత్ లోని 300లకు పైగా స్థానిక బ్యాంకులు చెల్లింపు సమస్యల్ని ఎదుర్కొన్నట్లుగా వెల్లడించింది. దీంతో.. చెల్లింపుల సమస్యల్ని పలువురు ఎదుర్కొన్నట్లుగా రాయిటర్స్ కథనం వెల్లడించింది.
ఆర్థిక సంస్థలకు బ్యాంకింగ్ టెక్నాలజీ సిస్టమ్ లు అందించే సి - ఎడ్జ్ టెక్నాలజీస్ పై దాడికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ దాడిపై అటు సి-ఎడ్జ్ కానీ.. ఇటు భారత రిజర్వు బ్యాంక్ కానీ స్పందించింది లేదు. అయితే.. చెల్లింపు వ్యవస్థలను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం ర్యాన్సమ్ వేర్ దాడి ఉదంతం తన వరకు వచ్చినట్లుగా పేర్కొంది.
తాజా దాడిలో ర్యాన్సమ్ వేర్ ఫోకస్ మొత్తం.. కోఆపరేటివ్, రీజనల్ రూరల్ బ్యాంకులకు సాంకేతిక సాయానని అందించే సి-ఎడ్జ్ టెక్నాలజీ మీదనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చెల్లింపు వ్యవస్థలపై దీని ప్రభావం పడినట్లుగా ఒక పబ్లిక్ అడ్వైజరీ లో పేర్కొంది. దీనికి తగ్గట్లే.. ఈ బ్యాంకులకు సాంకేతిక సేవల్ని అందించే సి- ఎడ్జ్ టెక్నాలజీస్ ను రిటైల్పేమెంట్స్ ను వేరు చేసినట్లుగా చెబుతున్నారు. దీని ద్వారా మిగలిన చెల్లింపు సేవలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక.. నిలిచిపోయిన సదరు బ్యాంకు చెల్లింపు సేవల్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించే పనుల్ని చేపట్టారు. అవసరమైన సెక్యూరిటీ రివ్యూలను నిర్వహిస్తున్నారు. చెల్లింపులు నిలిచిపోయిన బ్యాంకులు వీలైనంత త్వరగా పని చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో సక్సెస్ అవుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం భారత్ తో పాటు పలు దేశాలకు చెందిన కంపెనీలు.. ప్రభుత్వ వ్యవస్థలు ర్యాన్సమ్ వేర్ ధాటికి ఎంతలా ప్రభావితం అయ్యాయో తెలిసిందే. అలాంటిది ఉన్నట్లుండి.. టార్గెట్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. దీని వెనుకున్న అసలు టార్గెట్ ఏమిటన్నది తేలాల్సి ఉంది.