ఎయిర్ పోర్టులో 14.8 కేజీల బంగారం పట్టివేత.. సినీ నటి అరెస్ట్
బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.
By: Tupaki Desk | 5 March 2025 10:58 AM ISTబెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన కన్నడ సినీ నటి రన్యా రావు వద్ద నుంచి 14.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు DRI (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు తెలిపారు.
- తరుచుగా దుబాయ్ ప్రయాణాలు.. అధికారులు అనుమానం
రన్యా రావు ఇటీవల తరచుగా దుబాయ్ వెళ్లి వస్తున్నారని అధికారులు గుర్తించారు. గత 15 రోజుల్లోనే 4 సార్లు ఆమె దుబాయ్ వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచిన అధికారులు ఎయిర్ పోర్టులో ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు.
-అధిక మొత్తంలో బంగారం పట్టివేత
రన్యా రావు లగేజీని పరిశీలించగా 14.8 కిలోల బంగారం దొరికినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తగిన ఆధారాలను సమర్పించలేకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై DRI బృందం ముమ్మరంగా విచారణ చేపట్టింది. బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రన్యా రావుకు ఎవరైనా సహకరించారా? మరో పెద్ద ముఠా ఉన్నదా? అనే కోణంలో అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
-రన్యా రావు ఎవరు?
రన్యా రావు కన్నడ చిత్రసీమలో నటిగా గుర్తింపు పొందారు. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘మాణిక్య’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆమె 'మాస్టర్ పీస్', 'చంద్రిక', వాఘా , పటాకీ వంటి చిత్రాల్లో నటించారు. అయితే, ఆమెకు స్మగ్లింగ్ సంబంధం ఉందా? లేక కేవలం ఎవరైనా ఇరికించారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నటిపై అనుమానంతో ఆమెను అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.