Begin typing your search above and press return to search.

అప్పుడు తిట్టారని.. ఇప్పుడు కొట్టారని.. రన్యారావు కేసులో ట్విస్టు

దుబాయ్ నుంచి తాను విమానాశ్రయానికి వచ్చినప్పుడు తన వెంట బంగారాన్ని తీసుకురాలేదని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   16 March 2025 10:01 AM IST
అప్పుడు తిట్టారని.. ఇప్పుడు కొట్టారని.. రన్యారావు కేసులో ట్విస్టు
X

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కన్నడ సినీ నటి రన్యారావు స్మగ్లింగ్ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. దుబాయ్ నుంచి వస్తూ 14 బంగారు కడ్డీల్ని ప్రత్యేక వస్త్రధారణతో స్మగుల్ చేస్తున్న వైనాన్ని డీఆర్ఐ అధికారులు (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) గుర్తించి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతంఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. జైలు సూపరింటెండెంట్ ద్వారా ఒక లేఖను డీఆర్ఐకు పంపారు. దుబాయ్ నుంచి తాను విమానాశ్రయానికి వచ్చినప్పుడు తన వెంట బంగారాన్ని తీసుకురాలేదని పేర్కొన్నారు.

తనతో ప్రయాణించిన కొందరు ప్రయాణికుల్ని సేవ్ చేసేందుకు అధికారులు తనను టార్గెట్ చేశారన్నారు. తనను కస్టడీలోకి తీసుకొన్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పలుమార్లు చెంపదెబ్బలు కొట్టారని.. పదుల సంఖ్యలో వైట్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నట్లు పేర్కొన్నారు. తాను నిర్దోషినని ఎంత చెప్పినా వారు తన మాటల్ని వినిపించుకోలేదన్న ఆమె.. మరికొన్ని విషయాల్ని పేర్కొన్నారు.

తనను ఎయిర్ పోర్టులో కాదని.. విమానంలోనే అరెస్టు చేశారంటూ కొత్త వాదన వినిపించారు. కోర్టులో హాజరుపర్చటానికి ముందు అధికారులు పది.. పదిహేనుసార్లు తనను చెంపదెబ్బలుకొట్టినట్లుగా ఆరోపించారు. ఆమెను కోర్టు ఎదుట హాజరు పర్చిన సమయంలో.. అధికారులు చేయి చేసుకున్నారా? అని కోర్టులో అడిగితే కాదన్న ఆమె.. తనను తిట్టారని మాత్రమే చెప్పటం తెలిసిందే.

అందుకు భిన్నంగా తాజా వాదన వినిపించారు. తనను ఎంత కొట్టినా వాళ్లు టైప్ చేసిన పేపర్ల మీద సంతకాలు చేయనని చెప్పానని.. దీంతో అన్యాయంగా తన తండ్రి పేరును తీసుకొచ్చారన్నారు. తన తండ్రి పేరును బయటకు తీసి పరువు తీస్తామని బెదిరిస్తే.. తీవ్ర ఒత్తిడితో వాళ్లు చెప్పినట్లుగా టైపు చేసిన 60 పేజీలపైనా.. 40 తెల్లకాగితాల మీదా సంతకాలు చేసినట్లుగా వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. రన్యారావు సవతి తండ్రి కె.రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీసు గృహ.. మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేట్ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన్ను సెలవు మీద పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెలవు మీద పంపటానికి కారణాల్ని వెల్లడించకపోవటం గమనార్హం. రానున్న రోజుల్లో రన్యారావు కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.