గోల్డ్ స్మగ్లింగ్ కేసు: రన్యాను కస్టడీలో హింసించారా! మహిళా కమీషన్ ఏమంటోంది?
మరోవైపు రన్యారావు తాను మాసినకంగా ఇబ్బంది పడుతున్నానని, విచారణ క్రమంలో నిదుర పట్టడం లేదని తెలిపారు.
By: Tupaki Desk | 8 March 2025 2:59 PM ISTగోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుపై సీబీఐ దర్యాప్తు ప్రకటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రన్యా రావు అరెస్టు తర్వాత కొన్ని రోజులకే బంగారం అక్రమ రవాణా చేస్తున్న ముఠాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశాల నుండి వివిధ విమానాశ్రయాల ద్వారా భారతదేశానికి బంగారం తీసుకువచ్చే స్మగ్లర్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసిందని అధికారులు శనివారం తెలిపారు.
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారంతో రన్యా రావును అరెస్టు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)తో సీబీఐ సమన్వయంతో పనిచేస్తోంది. అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి రెండు సీబీఐ బృందాలు ఇప్పటికే ముంబై, బెంగళూరు విమానాశ్రయాలకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.
మరోవైపు రన్యారావు తాను మాసినకంగా ఇబ్బంది పడుతున్నానని, విచారణ క్రమంలో నిదుర పట్టడం లేదని తెలిపారు. అయితే నటి రన్యా రావు నుండి సమాచారం సేకరించడానికి అధికారులు థర్డ్ డిగ్రీ పద్ధతులను ఉపయోగించారా? కళ్ళ కింద గాయాలతో ఉన్న ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక కలిగిన సందేహాలివి. అయితే ఈ ఫోటోగ్రాఫ్ మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారంతో పట్టుబడినప్పుడు అరెస్టు చేయగా.. ఆ తర్వాత పోలీస్ అధికారులు కస్టడీలో శారీరకంగా హింసించి ఉండవచ్చు అనే ఊహాగానాలకు దారితీసింది.
శుక్రవారం నాడు, రన్యారావు కళ్ల కింద, ముఖంపై గాయాలతో కనిపించిన ఫోటో వైరల్ అయింది. తాజా సమాచారం మేరకు ప్రత్యేక ఆర్థిక నేరాల విభాగం కోర్టు రణ్యను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించింది. ప్రముఖ వార్తా ఛానెల్ కథనం ప్రకారం, విమానాశ్రయంలో అరెస్టు చేయడానికి ముందు రన్యారావుకు గాయాలు అయ్యాయని, నటి రన్యా స్వయంగా డిఆర్ఐ అధికారులకు తెలియజేసినట్లు చెబుతున్నారు. ఈ విషయం కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి తీసుకురాగా.. చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి నిస్సహాయతను వ్యక్తం చేసారు.
మహిళా కమీషన్ నాగలక్ష్మి మాట్లాడుతూ..``ఆమె కస్టడీలో శారీరకంగా వేధింపులకు గురైతే అది చాలా ఖండించదగినది. అయితే మాకు అధికారిక ఫిర్యాదు అందకపోతే మేము ఎటువంటి చర్యను తీసుకోలేము. ఆమె కమిషనర్‌కు లేఖ రాయకపోతే లేదా ఈ విషయాన్ని పరిశీలించమని కోరుతూ నాకు లేఖ పంపకపోతే, ఆమెకు సహాయం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి, సరైన దర్యాప్తు కోరడానికి అవకాశం లేదు. మేం నివేదికను సమర్పించడానికి మాత్రమే సంబంధిత అధికారులకు లేఖను రాయగలము. అధికారిక ఫిర్యాదు లేకుండా మేము చేయగలిగేది ఏమీ లేదు.. అని నాగలక్ష్మి చౌదరి అన్నారు.
మరోవైపు రన్యా రావు ఒక ముఠాతో కలిసి యుఎఇ సహా ఇతర దేశాల నుండి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసే పనిలో ఉందని డిఆర్‌ఐ వాదించింది. కర్ణాటక డిజిపి కె రామచంద్రరావు సవతి కుమార్తె కావడంతో రన్యా సులువుగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేయగలిగిందని, తనకు ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. గత ఏడాది కాలంలో రన్యా 27 సార్లు దుబాయ్‌కు ప్రయాణించినట్లు కూడా కథనాలొచ్చాయి.