Begin typing your search above and press return to search.

ర‌న్యారావు స్మ‌గ్లింగ్ కేసు స‌వ‌తి తండ్రి మెడ‌కు!

బంగారం క‌డ్డీల అక్ర‌మ ర‌వాణాలో అరెస్ట్, ఈ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించడానికి ర‌న్యారావు ప్రోటోకాల్ అధికారాలను దుర్వినియోగం చేసార‌ని ఉత్త‌ర్వులో పేర్కొన్నారు..

By:  Tupaki Desk   |   12 March 2025 11:35 AM IST
ర‌న్యారావు స్మ‌గ్లింగ్ కేసు స‌వ‌తి తండ్రి మెడ‌కు!
X

బెంగళూరు విమానాశ్రయంలో గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో డిఆర్ఐ అధికారుల‌కు చిక్కిన‌ కన్నడ నటి రన్యా రావు ప్రోటోకాల్ అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై, గోల్డ్ అక్రమ రవాణా కేసులో ఆమె సవతి తండ్రి రామ‌చంద్ర‌రావు మెడ‌కు చుట్టుకుంటోంది. కుమార్తెకు స‌హ‌క‌రిండంలో ర‌న్యారావు స‌వ‌తి తండ్రి డిజిపి స్థాయి సీనియర్ ఐపిఎస్ అధికారి కె రామచంద్రరావు ప్రమేయం ఉంద‌నే ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను నియమించింది.

ఈ విచార‌ణ‌లో భాగంగా, బెంగ‌ళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ)లో పోలీసు అధికారుల లోపాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై నేర దర్యాప్తు విభాగం (సిఐడి) దర్యాప్తున‌కు కూడా ఆదేశించింది. '' ర‌న్యారావు ప్రోటోకాల్ సంబంధిత సౌకర్యాలను పొందటానికి దారితీసిన వాస్తవాలు, పరిస్థితులను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి), ఐపిఎస్ కేడర్, కర్ణాటక రాష్ట్ర పోలీసు హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రరావు పాత్రను పరిశోధించడానికి ఏసీఎస్ గౌరవ్ గుప్తాను దర్యాప్తు అధికారిగా నియమించారు'' అని ఉత్తర్వులో పేర్కొంది. దర్యాప్తు అధికారి వారంలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

బంగారం క‌డ్డీల అక్ర‌మ ర‌వాణాలో అరెస్ట్, ఈ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించడానికి ర‌న్యారావు ప్రోటోకాల్ అధికారాలను దుర్వినియోగం చేసార‌ని ఉత్త‌ర్వులో పేర్కొన్నారు.. ర‌న్యారావు దుబాయ్ నుండి వచ్చినప్పుడు రూ.12.5 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారు కడ్డీలను త‌ర‌లించిన‌ట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించడంతో మార్చి 3న విమానాశ్ర‌యంలో ఆమెను అరెస్టు చేశారు. భద్రతా తనిఖీలను తప్పించుకోవడానికి సీనియర్ ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబాలకు విస్తరించిన అధికారిక ప్రోటోకాల్‌లను ర‌న్యారావు దుర్వినియోగం చేసిందని అధికారులు ఆరోపించారు. ఈ అరెస్టు తర్వాత లావెల్లె రోడ్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో జరిగిన దాడిలో అధికారులు అదనపు మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.

బంగారం కడ్డీల స్మగ్లింగ్ ప్ర‌క్రియ‌లో ప్రమేయం ఉందనే ఆరోపణలపై రన్యా రావుకు సన్నిహితుడైన వ్యాపారవేత్త తరుణ్ రాజును డిఆర్‌.ఐ సోమవారం అరెస్టు చేసింది. బెంగళూరులోని ఒక ప్రముఖ హోటల్ యజమానితో సంబంధం ఉన్న రాజును నగర కోర్టు డిఆర్.ఐ కి ఐదు రోజుల కస్టడీకి పంపింది. ర‌న్యారావు అరెస్టుకు ముందు ఆమెతో క‌లిసి వ్యాపార‌వేత్త రాజు కూడా దుబాయ్‌కు వెళ్లాడని అధికారులు తెలిపారు.

ఈ వివాదంపై ఐపీఎస్ అధికారి రామచంద్రరావు ఒక ప్రకటనలో తన దిగ్భ్రాంతి, బాధను వ్యక్తం చేశారు. ఇటీవలి పరిణామాలతో షాక్ తిన్నాన‌ని, ర‌న్యారావు త‌న‌కు తెలియ‌కుండా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింద‌ని కూడా వ్యాఖ్యానించారు. అయినా చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని రామ‌చంద్ర అన్నారు.