Begin typing your search above and press return to search.

ఉండి కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ హుండీ!

ఈ క్రమంలో నరసాపురం నుంచే కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ఆర్‌ఆర్‌ఆర్‌ ఆశించారు.

By:  Tupaki Desk   |   1 July 2024 5:14 AM GMT
ఉండి కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ హుండీ!
X

అనేక తర్జనభర్జనల అనంతరం నరసాపురం సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు (ఆర్‌ఆర్‌ఆర్‌) పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం సీటును దక్కించుకుని టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. 2019లో ఆయన నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కొద్ది కాలానికే వైసీపీ అధిష్టానంతో తలెత్తిన విభేదాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. నిత్యం ‘ర చ్చబండ’ పేరుతో వైసీపీ ప్రభుత్వంపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టారు.


ఈ క్రమంలో నరసాపురం నుంచే కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ఆర్‌ఆర్‌ఆర్‌ ఆశించారు. అయితే ఆయనకు విచిత్రంగా ఏ పార్టీ నుంచి సీటు దక్కలేదు. చివరకు టీడీపీ తరఫున ఉండి సీటు దక్కించుకుని అక్కడ పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలో అప్పటికే ఉండి అభ్యర్థిగా ప్రకటించిన రామరాజును టీడీపీ అధినేత చంద్రబాబు పక్కనపెట్టారు.

రఘురామ గెలిచిన వెంటనే ఉండి నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇందుకోసం ‘స్వచ్ఛ ఉండి’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉండిని అభివృద్ధి చేసుకోవడానికి ఆయన విరాళాల సేకరణ (క్రౌడ్‌ ఫండింగ్‌) చేపట్టారు. స్వయంగా ఆయనే తన వంతుగా రూ.5 లక్షల విరాళంతో ‘డ్రైనేజీ మెయింటనెన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ ఉండి’ పేరుతో బ్యాంకులో ఖాతా తెరిచారు. ఉండిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, ఇలా ఎవరైనా విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో ఉందని.. ఈ నేపథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ప్రజల ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు ఆయన పలువురు పారిశ్రామికవేత్తలకు విరాళాలు ఇవ్వాలని లేఖలు రాశారు.

రఘురామ అప్పుడే కార్యక్షేత్రంలోకి కూడా దిగిపోయారు. ఉండి నియోజకవర్గంలో ఆక్విడెక్టుల్లో, కాలువల్లో పేరుకుపోయిన పూడికను తీయించే పనిని చేపట్టారు. జేసీబీలను తీసుకొచ్చి కాల్వల్లో పెరిగిపోయిన పూడికలను, గుర్రపుడెక్కను తొలగింపజేశారు.

వైసీపీ తన ఐదేళ్ల పాలనలో పంట, మురుగుకాలువల నిర్వహణను గాలికొదిలేసిందనే విమర్శలున్నాయి. దీంతో ఆ కాలువల్లో మట్టి, కిక్కిస, తూడు, గుర్రపుడెక్క భారీగా పేరుకుపోయాయని చెబుతున్నారు. నీటి సరఫరాకు ఇవి అడ్డం పడటంతో శివారు ప్రాంతాలకు నీరు చేరడం లేదని అంంటున్నారు. ముఖ్యంగా పంటల సాగుకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. నియోజకవర్గంలో పంట కాలువలు, మురుగుకాలువల ప్రక్షాళనే లక్ష్యంగా ‘డ్రైనేజీ మెయింటనెన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ ఉండి’ పేరుతో నిధుల సమీకరణ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న 40 రోజుల్లో ఉండి నియోజకవర్గంలో ఉన్న అన్ని కాలువలను ప్రక్షాళన చేస్తారు. నీటిపారుదలకు అవరోధాలు లేకుండా చర్యలు తీసుకుంటారు. దీనికి రూ.1.5 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది.

రఘురామ ఇచ్చిన పిలుపు బాగానే పనిచేస్తుందంటున్నారు. స్వయంగా ఆయనే రూ.5 లక్షలు ఇవ్వడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. మరికొందరు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద నిధులు అందజేస్తున్నారని తెలుస్తోంది.

ప్రముఖ సినీ నటుడు, ఒకప్పటి ప్రముఖ విలన్‌ రావుగోపాలరావు తనయుడు, రావు రమేశ్‌ తాజాగా రూ.3 లక్షల విరాళాన్ని రఘురామకు అందించారు. అలాగే ప్రముఖ నిర్మాత చలసాని అశ్వినీదత్‌ రూ.5 లక్షల విరాళం అందజేశారు. దీంతో స్వచ్ఛ ఉండి కోసం సేకరించిన ఈ మొత్తం ఇప్పుడు కోటి రూపాయలకు చేరుకుందని సమాచారం.

మొత్తానికి స్పీకర్‌ పదవిని లేదా మంత్రి పదవిని ఆశించిన రఘురామకృష్ణరాజుకు ఏ పదవీ దక్కలేదు. అయినప్పటికీ రఘురామ ఎక్కడా నిరాశ చెందకుండా ఉండి నియోజకవర్గంపై దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆయన ముందడగు వేస్తున్నారు.