రాపాకకు సరిగ్గా చూసి బ్రేక్ వేసిన జనసేన ?
రాపాక వరప్రసాదరావు గుర్తున్నారా. రాజకీయాల మీద అవగాహన ఉన్న వారి అందరికీ ఆయన తప్పకుండా గుర్తుండే ఉంటారు.
By: Tupaki Desk | 23 March 2025 11:42 PM ISTరాపాక వరప్రసాదరావు గుర్తున్నారా. రాజకీయాల మీద అవగాహన ఉన్న వారి అందరికీ ఆయన తప్పకుండా గుర్తుండే ఉంటారు. ఆయన 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2019లో ఆయన విజయం మాత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. జనసేన తరఫున ఏకైక ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ విజయం ఎంతటి ఘనం అంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు చోట్లా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో అభ్యర్ధులు అంతా ఓటమి పాలు అయ్యారు. కానీ ఒక్క రాజోలులో మాత్రమే రాపాక గెలిచి సత్తా చాటారు. అయితే రాపాక జనసేనలో ఉండకుండా వైసీపీలోకి జంప్ చేశారు. అసెంబ్లీలో ఆ పార్టీకి అనుకూలంగా ఆయన వ్యవహరించారు. దాంతో ఆయన మీద జనసేన కూడా ఫైర్ అయింది. తమ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయినా దూరం పెట్టేసింది.
ఇదిలా ఉంటే అయిదేళ్ళ పాటు జగన్ ని పొగుడుతూ రాజోలు నియోజకవర్గంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేగానే రాపాక చలామణీ అయ్యారు. అయితే సరిగ్గా 2024 ఎన్నికల వేళ రాపాకకు వైసీపీ ట్విస్ట్ ఇచ్చింది. ఆయనను అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేయించింది. రాజోలు సీటుని టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చింది.
దాంతో అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్న రాపాక ఎన్నికల అనంతరం వైసీపీకి గుడ్ బై కొట్టేశారు. ఆయన కూటమిలో చేరేందుకు నాటి నుంచే తన ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. జనసేనలోకి ఎటూ పోలేరు కాబట్టి టీడీపీలో చేరేందుకు ఆయన గట్టిగానే కృషి చేస్తున్నారు.
గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిమ్మల చిన రాజప్ప, యనమల రామక్రిష్ణుడు, బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి వాసు వంటి వారితో టచ్ లో ఉంటూ సైకిలెక్కేందుకు చూస్తున్నారు. టీడీపీ విషయం తీసుకుంటే గొల్లపల్లి సూర్యారావు వెళ్ళిపోయాక రాజోలులో ఆ పార్టీకి నాయకత్వం కొరత ఉంది.
దాంతో రాపాకను తీసుకునేందుకు టీడీపీ పెద్దలకు ఇష్టం ఉంది కానీ అదే సమయంలో జనసేన నుంచి తీవ్రమైన అభ్యంతరం వస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 21 సీట్లకు 21 సీట్లూ గెలిచినా 2019లో గెలిచిన ఏకైక సీటు విలువను మాత్రం జనసేన మరచిపోలేకపోతోంది. నాడు ఉన్న ఒక్క సీటుని కూడా వైసీపీకి అనుకూలంగా మార్చిన రాపాక విషయంలో జనసేన నేతలు ఈ రోజుకీ గుర్రుగానే ఉన్నారు అంటున్నారు.
రాపాకను చేర్చుకోవద్దని వారు గట్టిగానే టీడీపీ పెద్దలకు చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దాంతో విస్తరిలో భోజనం ఉంది, కడుపులో ఆకలి ఉంది. కానీ తినేందుకు మాత్రం వీలు లేని స్థితిలో ఈ మాజీ ఎమ్మెల్యే పడిపోయారని అంటున్నారు. 2019 నుంచి 2024 మధ్య జనసేన ఈ మాజీ ఎమ్మెల్యే వల్ల ఎంతో ఇబ్బంది పడిందని ఇపుడు ఆయన చేరితే కనుక తమ బాధలకు విలువ ఏమి ఉంటుందని జనసైనికులు అంటున్నారుట.
మొత్తానికి రాపాక కాంగ్రెస్ నుంచి వైసీపీ అలాగే జనసేన తిరిగి వైసీపీ ఇలా పార్టీలు సులువుగానే మార్చగలిగారు కానీ అవసరం అవకాశం అన్నీ కూడా సైకిలెక్కలేకపోతున్నారు అని అంటున్నారు. సరైన సమయం చూసి సరిగ్గా ఎక్కడ బ్రేకులు వేయాలో అక్కడ జనసేన బ్రేకులు వేసిందని అంటున్నారు. మరి జనసేన మెత్తబడితేనే తప్ప రాపాక టీడీపీలోకి వెళ్ళలేరు అని అంటున్నారు. ఆ రోజు ఎపుడూ అంటే వేచి ఉండాల్సిందే అని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియదు కానీ రాపాక మాత్రం మాజీ వైసీపీ నేతగానే మిగిలిపోతున్నారు అని అంటున్నారు.