Begin typing your search above and press return to search.

ఈవీఎం ట్యాంపరింగ్... జగన్ కి షాకిచ్చిన వైసీపీ నేత!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Jun 2024 11:17 AM GMT
ఈవీఎం ట్యాంపరింగ్... జగన్ కి షాకిచ్చిన వైసీపీ నేత!
X

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 175 అసెంబ్లీ స్థానాలకు గానూ వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది. దీంతో... ఈ షాక్ నుంచి తేరుకున్న వైసీపీ అధినేత.. ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను శకుని పాచికలతో పోల్చారు!

ఇదే సమయంలో... పలువురు వైసీపీ నేతలు కూడా ఈవీఎంలపై కామెంట్ చేశారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే... దేశవ్యాప్తంగా ఈవీఎంలలో జరిగిన మోసాలు ఇవి అంటూ ప్రజెంటేషనే ఇచ్చారు. 40% వచ్చిన మోడీ ప్రధాని, 40% వచ్చిన రేవంత్ సీఎం అయ్యారు కానీ... 40% వచ్చిన వైసీపీకి మాత్రం దారుణమైన ఫలితాలు వచ్చాయంటూ రోజా స్పందించారు!

ఎన్నికల ఫలితాల అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎమ్మెల్సీలతో వరుస సమావేశాలు నిర్వహించిన జగన్... ప్రతీ భేటీలోనూ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తపరిచారు! ఆ సంగతి మరోపక్క వైసీపీ శ్రేణుల్లోనూ ఈ విషయంపై బలమైన చర్చ నడుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే వైసీపీ.. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన పరిస్థితి! ఈ నేపథ్యంలో వైసీపీకి షాకిచ్చారు రాపాక.

అవును... 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి గెలిచిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... అనంతరం పార్టీ ఫిరాయించి వైసీపీలో చేరారు. ఈ క్రమంలో తాజా ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టిక్కెట్ దక్కించుకున్న ఆయన... 3,42,196 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సమయంలో తాజాగా వైసీపీ అభిప్రాయాలతో ఆయన విభేదించినట్లు వ్యాఖ్యానించారు.

తాజా ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రాపాక వరప్రసాద్... ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ నేతలు చేస్తున్న వాదనపై స్పందించారు. ఇందులో భాగంగా... ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు అబద్ధమని తేల్చేశారు. గతంలో అన్ని పార్టీలూ విడిగా పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు తమకు తెలుసని.. ఇప్పుడు మూడు పార్టీలూ కలిసిపోవడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని చెప్పుకొచ్చారు.

ఇలా ఓ పక్క ఈవీఎంలపై వైసీపీ అధినేత, నేతలు ఒకరకమైన వాదన వినిపిస్తుండగా.. వైసీపీ శ్రేణుల్లోనూ ఈ మేరకు బలమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో... వారితో పూర్తిగా విభేదిస్తున్నట్లుగా రాపాక వరప్రసాద్ స్పందించడం ఇప్పుడు వైరల్ గా మారింది.