'రేప్' ఆరోపణలు ఫేక్ అని కోర్టుకు వస్తే ఏం చేయాలో చెప్పిన సుప్రీం
అత్యాచారం జరిగిందని బాధితురాలు ఆరోపించినప్పుడు పోలీసులు స్పందించే వైనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
By: Tupaki Desk | 10 Aug 2023 5:03 AM GMTఅత్యాచారం జరిగిందని బాధితురాలు ఆరోపించినప్పుడు పోలీసులు స్పందించే వైనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కొనే నిందితుడి మాటేమిటి? తాను తప్పు చేయకున్నా.. తప్పు చేసినట్లుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలన్న సందిగ్ధం ఉంటుంది. ఇలాంటి అంశంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అత్యాచారం బాధితురాలికి ఎంతటి వేదనను.. అవమానాన్ని.. నష్టాన్ని కలిగిస్తుందో.. అలాంటి కేసుల్లో అసత్యపు ఆరోపణలతో ఇరుక్కునే పురుషులకు సైతం అంతటి కష్టమే వస్తుందని సుప్రీం పేర్కొంది.
లైంగిక వేధింపుల అంశంపై అసత్యపు ఆరోపణలు ఎదుర్కొనే పురుషులకు కలిగే ఇబ్బంది గురించి ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. చేయని నేరానికి తప్పుడు ఉద్దేశాలతో కేసులు పెట్టారని నిందితుడు కోర్టును ఆశ్రయిస్తే.. ఏం చేయాలన్న అంశాన్ని ప్రస్తావించింది. తప్పుడు ఆరోపణలని నిందితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. ఎఫ్ఐఆర్ ను మరింత జాగ్రత్తగా పరిశీలించటంతోపాటు.. ప్రాథమిక ఆధారాల్ని.. అంశాల్ని.. ఫిర్యాదుదారు వాంగ్మూలాన్ని.. సాక్ష్యాల్ని లోతుగా పరిశీలించాలని పేర్కొంది. అప్పుడే ఆరోపణల నిగ్గు తేలే వీలుందని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం యూపీలోని ఒక అత్యాచార ఉందంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక రౌడీ షీటర్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా నిందితుల అంశం ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు వెల్లడించింది. అయితే.. ఈ కేసులో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ పై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టేసింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు రౌడీ షీటర్ పై నమోదైన అంశాలు.. ఎఫ్ఐఆర్ లో బాధితురాలికి సంబంధించిన అంశాల్ని చూసినప్పుడు ఆమె.. తప్పుడు ఉద్దేశంతో ఆరోపణలు చేశారనటానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ.. హైకోర్టును తీర్పును కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో.. ఆరోపణలు ఎదుర్కొనే నిందితులకు ఉండాల్సిన వెసులుబాటును ప్రస్తావించటం గమనార్హం.