మాంచి జోరు మీదున్న ర్యాపిడో.. టార్గెట్ 500 సిటీస్!
ఇప్పటికే తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 50 పైచిలుకు పట్టణాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఏడాదిలో 500 పట్టణాల్లో విస్తరించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 10 March 2025 4:00 PM ISTబైక్.. ఆటో.. కారు.. వాహనం ఏదైనా కానీ బుక్ చేసిన కాసేపటికే ముంగిట్లోకి వచ్చి వాలే వాహనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రైడ్ సేవల సంస్థల్లో ఒకటి ర్యాపిడో. మిగిలిన వాటికి దీనికి ఉన్న తేడా ఏమంటే.. ర్యాపిడో అసలుసిసలు తెలుగోళ్ల కంపెనీ. అతి తక్కువ సమయంలో ఈ సంస్థ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 50పైచిలుకు పట్టణాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఏడాదిలో 500 పట్టణాల్లో విస్తరించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ సత్తా చాటిన ర్యాపిడో తర్వాత టార్గెట్ తమిళనాడు.. కర్ణాటక.. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల మీద ఫోకస్ చేయనుంది. ప్రస్తుతం రోజూ 33 లక్షల రైడ్ లు నమోదు అవుతున్నాయి. ఈ మొత్తం రైడ్లలో టూవీలర్ల విభాగం వాటానే ఎక్కువ. రోజుకు 15 లక్షల ట్రిప్పులు టూవీలర్ల విభాగంలో.. 13 లక్షల ట్రిప్పులు త్రీవీలర్ సెగ్మెంట్ లో.. 5 లక్షల ట్రిప్పులు కార్ల విభాగంలో ఉంటున్నాయని కంపెనీ చెబుతోంది.
ఏడాది క్రితం ఫోర్ వీలర్ల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి గణనీయమైన వ్రద్ధిని నమోదు చేయటం విశేషం. అయితే.. మిగిలిన సంస్థల మాదిరి డ్రైవర్ల నుంచి కమీషన్ ప్రాతిపదికన కాకుండా ఫ్లాట్ ఫాం యాక్సెస్ ఫీజు విధానాన్ని అమలు చేయటం ద్వారా డ్రైవర్లకు ఆదాయం అదనంగా వస్తోంది. ఇది కూడా ర్యాపిడో వ్రద్ధికి కారణంగా చెబుతారు. మరి.. సంస్థ పబ్లిక్ ఇస్యూకు వస్తుందా? అంటే మాత్రం నో అంటే నో చెబుతున్నారు. కారణం.. ఇప్పటికే తమ వద్ద గణనీయమైన నిధులు ఉన్న నేపథ్యంలో ర్యాపిడో సేవల్ని విస్తరించటమే తప్పించి.. పబ్లిక్ ఇష్యూకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. మిగిలిన సంస్థలకు కాస్త భిన్నమైన ఫార్మాట్ లో ర్యాపిడో వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.