30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో అరుదైన దృశ్యం!
వాస్తవానికి తీర్పు వెళ్లడించిన అనంతరం... వారం లోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ ప్రకటించినప్పటికీ.. సత్వరమే ఆ ఏర్పాట్లను పూర్తి చేసి పూజలు మొదలుపెట్టింది.
By: Tupaki Desk | 1 Feb 2024 12:55 PM GMT"జ్ఞానవాపి" ప్రార్థనా మందిరంలోని సీల్ చేసి ఉన్న ప్రాంతంలో పూజలు చేసుకునేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా వారం రోజుల్లోగా పూజాకర్యక్రమాలు చేసుకొవడానికి ఏర్పాట్లు చేయాలని స్థానిక యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో... ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో జ్ఞానవాపిలో సుమారు 30ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో అరుదైన దృశ్యం కనిపించింది.
అవును... ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని బేస్ మెంట్ లో సుమారు 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో... వారణాసి కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం అతితక్కువ వ్యవధిలోనే పూజలు జరగడం గమనార్హం. ఇందులో భాగంగా... వ్యాస్ కా తెహఖానా (వ్యాసుడి నేలమాళిగ) బేస్ మెంట్ లో ఉదయం 3 గం.కే విగ్రహాలకు తొలి పూజ ప్రారంభమైంది.
వాస్తవానికి తీర్పు వెళ్లడించిన అనంతరం... వారం లోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ ప్రకటించినప్పటికీ.. సత్వరమే ఆ ఏర్పాట్లను పూర్తి చేసి పూజలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... విశ్వనాథుడి ఆలయ పూజారి విగ్రహాలకు మంగళహారుతులు ఇచ్చారు. ఈ సమయంలో... రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీద్ సమీపంలో "మందిర్" (ఆలయం) అనే బోర్డును అంటించారు.
కాగా... జ్ఞానవాపి విషయంలో ఇటీవల వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై విశ్వహిందూపరిషత్ (వీ.హెచ్.పీ) అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పందించారు. ఇందులో భాగంగా... ఈ తీర్పు ప్రతి హిందువు హృదయంలో సంతోషాన్ని నింపిందని అన్నారు.
ఇదే సమయంలో... "శివ భక్తులకు న్యాయం జరిగింది. ఈ క్రమంలో... విశ్వనాథుని ఆలయ సముదాయంలోగల వ్యాసుని నేలమాళిగలో పూజలు చేసుకునే హక్కును కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను" అంటూ ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆన్ లైన్ వేదికగా ఎక్స్ లో స్పందించారు.