ఒకే ఫ్రేములో చంద్రబాబు, పవన్, బొత్స.. స్పెషల్ ఏంటో తెలుసా?
వాస్తవానికి బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటో సెషన్ ఉంటుంది.
By: Tupaki Desk | 18 March 2025 1:35 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ రోజు ఫొటో సెషన్ నిర్వహించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, యువనేత లోకేశ్ తోపాటు వైసీపీ పక్ష నేత బొత్స సన్యానారాయణతో కలిసి ఫొటో దిగారు. గత కొన్నేళ్లలో ఇలాంటి అరుదైన దృశ్యం రాష్ట్రంలో కనిపించకపోవడం విశేషం. వాస్తవానికి బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటో సెషన్ ఉంటుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ సంప్రదానికి ఫుల్ స్టాప్ పట్టింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ ఫొటో సెషన్ ప్రారంభించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆధ్వర్యంలో శాసనసభ్యులు, మండలి చైర్మన్ మోషేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీకు ఫొటో సెషన్ నిర్వహించారు.
మొదటి వరుసలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు కూర్చొగా ఎమ్మెల్యేల సీనియారిటీ ప్రకారం 2,3,4 వరుసలు కేటాయించారు. ఇక మండలి ఫొటో సెషన్ లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తోపాటు వైసీపీకి చెందిన ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ కూడా ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటో సెషన్ కు వైసీపీ ఎమ్మెల్సీలు సైతం హాజరు కావడం విశేషం.
పవన్ ను పలకరించిన బొత్స
ఈ ఫొటో సెషన్ సందర్భంగా మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మండలి సభ్యులతో ఫొటో తీయించుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ ఆప్యాయంగా పలకరించారు. బాగున్నారా.. అంటూ పవన్ యోగక్షేమాలపై ఆరా తీయగా పవన్ కరచాలం చేస్తూ బొత్సతో మాట్లాడారు. గత ఏడాది నవంబర్ లో సైతం పవన్, బొత్స ఆప్యాయంగా కౌగిలించుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇరువరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికి మెగా ఫ్యామిలీతో బొత్సకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన సోదరుడు లక్ష్మణరావు ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు.