పిల్లిని రక్షించబోయి ఐదుగురు దుర్మరణం... ఇదేనా అసలు కారణం?
వివరాళ్లోకి వెళ్తే... అహ్మద్ నగర్ జిల్లాలోని నెవాసా తాలుకాలోని వాకాడి గ్రామంలో మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక పిల్లి బావిలో పడిపోయింది.
By: Tupaki Desk | 10 April 2024 7:53 AM GMTఒక పిల్లిని రక్షించడానికి ప్రయత్నించిన ఐదు మంది మరణించిన అరుదైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పాడుబడిన బావిలో పడిపోయిన ఆ పిల్లిని రక్షించబోయి ఒకరి తర్వాత ఒకరు మృతి చెందగా.. చివరిలో బావిలోకి దిగిన ఆరో వ్యక్తిని మాత్రం రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అరుదైన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో జరిగింది.
వివరాళ్లోకి వెళ్తే... అహ్మద్ నగర్ జిల్లాలోని నెవాసా తాలుకాలోని వాకాడి గ్రామంలో మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక పిల్లి బావిలో పడిపోయింది. ఈ సమయంలో ఆ గ్రామంలోని వ్యక్తులు ఆ బావిలో పడిన పిల్లిని రక్షించాలని ఫిక్సయ్యారు. దీంతో వారు ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దూకారు. ఈ సమయంలో ఆ బావిలో చిక్కుకుపోయారు. అనంతరం మృతి చెందారు.
ఈ సమయంలో ఆ ఐదుగురితోపాటు మరో వ్యక్తి చివర్లో నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగగా.. అతడిని మాత్రం మిగతా గ్రామస్థులు త్వరగా బయటకు తీసి ఆస్పత్రిలో చేర్పించారు. ఇలా బావిలో నుంచి బయటపడిన వ్యక్తి పేరు విజయ్ మాణిక్ కాలే (35) అని.. అతడు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాడని చెబుతున్నారు.
మృతదేహాలను బయటకు తీసే పని బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల వరకూ కొనసాగిందని సెవాసా పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక మృతదేహాన్ని తీయగా.. మిగిలిన నాలుగు మృతదేహాలను తీయడానికి గంటన్నరకు పైగా సమయం పట్టిందని చెబుతున్నారు.
ఒక రైతు బయోగ్యాస్ స్లర్రీని పడవేసిన ఆ పాడుబడిన బావిలోనే ఈ ఐదుగురూ చిక్కుకున్నారని.. అందుకే వీరు మృతి చెందారని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తుంది. వారు ఆ బయోగ్యాస్ బావిలో ఊబిలో చిక్కుకుపోయారని చెబుతున్నారు. అందువల్లే మృతదేహాలను వెలికితీయడం కూడా ఎక్కువగానే శ్రమించాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది!