కిరణ్ కుమార్ రెడ్డి ఇంత దిగజారి పోయారా ?
ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేళ ఇద్దరు మాజీ సీఎంలు కిరణ్ బాబు కలయిక మాత్రం ఒక రేర్ పిక్ అనే అంటున్నారు అంతా.
By: Tupaki Desk | 26 April 2024 8:56 AM GMTనల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి. ఆయన్ని జాక్ పాట్ సీఎం అని కూడా అంటారు. ఆయన లాస్ట్ బాల్ అంటూ సమైక్య ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించారు అని విమర్శలూ ఉన్నాయి. ఇక స్పీకర్ గా చేసి కేవలం ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి కాకుండానే సీఎం అయిన ఘనత నల్లారి వారిది. ఆయనది రాజకీయ కుటుంబం. ఆ వారసత్వాన్ని ఆయన కొనసాగించారు.
ఇక నల్లారి వారి కుటుంబాన్ని రాజకీయంగా ముందుకు తెచ్చింది దివంగత వైఎస్సార్. ఆయన ప్రోత్సాహంతోనే నల్లారి కిరణం రాజకీయంగా మెరిసింది. ఆయనకు చిత్తూరు జిల్లా రాజకీయ సమీకరణల మూలంగా మంత్రి పదవి ఇవ్వలేకపోయినా స్పీకర్ గా చాన్స్ ఇచ్చారు వైఎస్సార్. 2009లో వైఎస్సార్ చనిపోయేనాటికి స్పీకర్ గా నల్లారి ఉండబట్టే ఆయన కేంద్ర కాంగ్రెస్ పెద్దల దృష్టిలో పడ్డారు. అలా ఆయన సీఎం పదవికి రాజమార్గం ఏర్పడింది. ఇదీ వైఎస్సార్ నల్లారి వారికి చేసిన మహోపకారం.
ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో చూస్తే నల్లారి వారి తండ్రి అమరనాధ్ రెడ్డి ఉండేవారు. ఆయన పాత తరం కాంగ్రెస్ నాయకుడు. అరవై డెబ్బై లల్లో ఆయన చిత్తూరు జిల్లాను శాసించిన రాజకీయ నేత. మంత్రిగా పనిచేసిన వారు 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయిన చంద్రబాబు అదే కాంగ్రెస్ లో చిత్తూరు జిల్లాలో నల్లారి అమరనాధ్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు నెరిపారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కుతూహలమ్మను అధికార కాంగ్రెస్ అభ్యర్ధికి వ్యతిరేకంగా పోటీగా పెట్టి ఓడించారు. దాంతో అమరనాధ్ రెడ్డికి చంద్రబాబుకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్థితి ఉంది.
ఈ నేపధ్యం అలాగే కొనసాగింది. రెండు కుటుంబాల మధ్య ద్వేషం అలాగే ఉంది. అది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా కొనసాగింది. 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయిన కిరణ్ సైతం చంద్రబాబు అంటే పూర్తి వ్యతిరేకతతో ఉండేవారు. బాబు అంటే పడదు కాబట్టే ఆయన్ని ఇబ్బంది పెట్టడానికే కిరణ్ ని వైఎస్సార్ స్పీకర్ గా చేశారు అన్న ప్రచారం ఉంది. ఇక స్పీకర్ గా ఎన్నిక అయిన కిరణ్ కుమార్ రెడ్డిని ఆ ఉన్నతాసనం మీద కూర్చోబెట్టడానికి విపక్ష నేతగా చంద్రబాబు నాడు రాలేదు.
అంటే ఎంతలా కిరణ్ పట్ల బాబుకు వ్యతిరేకత ఉందో అర్ధం అవుతోంది. ఇక కిరణ్ కూడా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉండేవారు. ఆయన బాబు విధానలను ఆయన మార్క్ రాజకీయాన్ని తూర్పరా పడుతూ ఉండేవారు. అలాంటిది కిరణ్ ఉమ్మడి ఏపీ సీఎం గా మూడేళ్లు పని చేసిన మీదట పదేళ్ల రాజకీయ అజ్ఞాత వాసం తొలగించుకుని బీజేపీలో చేరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.
టీడీపీ కూటమిలో బీజేపీ ఉండడంతో కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు. ఈ ఇద్దరు నేతలు ఇలా కలవడం చిత్తూరు రాజకీయాలకు అలాగే రాయలసీమ రాజకీయాలను దగ్గరుండి చూసిన వారికి మాత్రం విస్మయం కలిగించింది అని చెప్పాలి. బద్ధ శత్రువులుగా రెండు పార్టీలలో ఉంటూ దశాబ్దాల పాటు పనిచేసిన వారు ఇలా ఒక వేదిక మీద పక్క పక్కనే నవ్వులు చిందిస్తూ కనిపించడం అంటే నివ్వెర పోయిన వారు ఉన్నారు.
ఇక చంద్రబాబు రాజకీయం తెలిసిన వారికి ఇది వింతా విడ్డూరం కానే కాదు అంటున్నారు. ఆయన ఎవరితో అయినా కలిసి పోగలరు. వీలు కుదరకపోతే విడిపోగలరు అని కూడా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి తీరునే అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మూడేళ్ళ పాటుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ బాబు స్థాయి నాయకుడే. పైగా సీఎంగా తాను బెటర్ గా చేశాను అని తరచూ చెప్పుకుంటారు.
తాను అమలు చేసిన విధానాలను తరువాత వచ్చిన చంద్రబాబు కొనసగించలేదని ఫలితంగా రాయలసీమ ఇబ్బందులో ఉందని కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఘాటైన విమర్శలు చేసిన సందర్భం కూడా ఉంది. అటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కేవలం ఎంపీగా గెలవాలన్న ఆలోచనతో బాబుతో కలసి నవ్వులు చిందించడం చూసిన వారు ఔరా రాజకీయమా అని అనుకుంటున్నరు.
కేవలం ఎంపీ అయితే చాలు అని అన్నీ మరచిపోయి చంద్రబాబుతో స్టేజ్ ని పంచుకోవడం చూసిన వారు నల్లారి వారి వారసుడు పాత విషయాలను మరచిపోయారా రాజీపడ్డారా అని అంటున్నారు. హాయిగా సీఎం చేశారు. కేవలం ఎంపీ సీటు కోసం అన్నీ చంపుకుని తానుగా తగ్గించుకుని రాజీ పడడం కిరణ్ కి అవసరమా అని అంటున్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేళ ఇద్దరు మాజీ సీఎంలు కిరణ్ బాబు కలయిక మాత్రం ఒక రేర్ పిక్ అనే అంటున్నారు అంతా.