హైదరాబాద్ లో రేర్ పొలిటికల్ సీన్.. ఇంకెప్పటికీ సాధ్యం కాదేమో?
నిజానికి ఈ సీన్ మరింత పటిష్టం కావటానికి.. సమ్ థింగ్ స్పెషల్ డే కావటానికి ఎమ్మెల్సీ కవిత అరెస్టు కారణమని చెప్పాలి.
By: Tupaki Desk | 16 March 2024 4:50 AM GMTఅవును.. శుక్రవారం హైదరాబాద్ మహానగరం రేర్ పొలిటికల్ సీన్ కు వేదికగా మారింది. ఇలాంటి పరిస్థితి.. పరిణామాలు ఇంకెప్పటికీ సాధ్యం కాదేమో అన్నట్లుగా పరిస్థితి మారింది. నిజానికి ఈ సీన్ మరింత పటిష్టం కావటానికి.. సమ్ థింగ్ స్పెషల్ డే కావటానికి ఎమ్మెల్సీ కవిత అరెస్టు కారణమని చెప్పాలి. ఒకే రోజులో ఒకే ప్రాంతంలో దేశ రాష్ట్రపతి.. ప్రధానమంత్రి.. గవర్నర్.. ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటం.. అదే టైంలో మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను ఈడీ అరెస్టు చేసి.. ఢిల్లీకి తరలించటం లాంటి అరుదైన పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి.
సాధారణంగా ఇంతమంది వీవీఐపీలు ఒకే నగరంలో ఉండటమే అరుదైన అంశంగా చెప్పాలి. అదెలానంటే.. నగర శివారులో జరుగుతున్న భారీ అధ్యాత్మిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ మహానగరం సమీపంలో ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మల్కాజిగిరిలో రోడ్ షోతో పాటు.. తెలంగాణలో శనివారం పర్యటించేందుకు వీలుగా ఆయన భాగ్యనగరిలోనే ఉన్నారు. ప్రధాని.. రాష్ట్రపతి ఇద్దరు వీవీఐపీలు నగరంలో ఉండటంతో గవర్నర్ సైతం యాక్టివ్ గా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఇలాంటి సందర్భంలోనే మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు కావటం సంచలనంగా మారింది.
ఓవైపు మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని మోడీ టాప్ లేని వాహనంలో ప్రయాణిస్తూ అందరికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వేళలోనే.. కవిత అరెస్టు కావటం.. ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్న సందర్భం ఒకటే కావటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ఇలాంటి అరుదైన పరిణామాలు ఒక మహానగర పరిధిలో ఒకే రోజున చోటు చేసుకోవటం భవిష్యత్తులో కూడా సాధ్యం కాదేమోనన్న మాటలో నిజం ఉందని చెప్పాలి.