Begin typing your search above and press return to search.

జడ్జి హిమబిందుపై పోస్టులు... రాష్ట్రపతి భవన్ సీరియస్!

ఈ పోస్టులపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ పోస్టులు పెడుతున్నవారిపైనా, షేర్ చేస్తున్నవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 11:01 AM GMT
జడ్జి హిమబిందుపై పోస్టులు... రాష్ట్రపతి భవన్  సీరియస్!
X

ఈ మధ్యకాలంలో స్పందించాలనే ఆత్రంలోనో, పరిపూర్ణమైన అజ్ఞానంలోనో తెలియదు కానీ... స్పందించే హక్కు లేని విషయాలపైనా స్పందిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. అసలు కోర్టు పరిధిలో ఉన్న అంశాలపైనే మాట్లాడకూడదనుకుంటే... ఏకంగా న్యాయమూర్తులపైనే అసభ్యకరంగా పోస్టులు పెట్టే స్థాయికి తెగించేస్తున్నారు. దీంతో రాష్ట్రపతి భవన్ రియాక్ట్ అయ్యేవరకూ వెళ్లింది వ్యవహారం.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును విచారిస్తున్న ఏసీబీ కోర్టు అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి హిమబిందు పైన గతకొన్ని రోజులుగా సోషల్ మీడియా అసభ్యకరమైన పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ పోస్టులపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ పోస్టులు పెడుతున్నవారిపైనా, షేర్ చేస్తున్నవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఇదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్‌ రామానుజరావు ఈ-మెయిల్‌ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఒక మహిళా జడ్జిని కించపర్చేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది అత్యంత హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ విషయంపై రాష్ట్రపతి భవన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యిందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి రాష్ట్రపతి భవన్‌ కార్యదర్శి పీసీ మీనా లేఖ రాశారు. జడ్జి హిమబిందుకు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని జవహర్‌ రెడ్డికి పీసీ మీనా లేఖ రాశారు. జడ్జి హిమబిందు పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఫిర్యాదు దారుడికి వెల్లడించాలని ఆ లేఖలో సూచించారు.

దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ విషయంపై పోలీస్ అధికారులతో చర్చించి, ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి, మహిళా జడ్జిపై పోస్టులు పెడుతున్నవారిని అదుపులోకి తీసుకోనున్నారని అంటున్నారు.

కాగా... స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ విజయవాడలోని ఈ నెల 10న ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సాగిన సుదీర్ఘ వాదనల తరువాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు, టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించారు. నాటినుంచి ఆ న్యాయమూర్తిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపిస్తుండటం కలకలం రేపింది.