రష్మిక మార్ఫింగ్ వీడియో.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్ రియాక్షన్!
టెక్నాలజీ విసృతంగా అభివృద్ధి చెందుతుందని ఆనందించేలోపు.. దానిద్వారా కొంతమంది చూపిస్తున్న పైశాచికానందం అతిపెద్ద సమస్యగా మారుతుంది.
By: Tupaki Desk | 6 Nov 2023 9:29 AM GMTటెక్నాలజీ విసృతంగా అభివృద్ధి చెందుతుందని ఆనందించేలోపు.. దానిద్వారా కొంతమంది చూపిస్తున్న పైశాచికానందం అతిపెద్ద సమస్యగా మారుతుంది. కొన్ని ఫోటోలు, వీడియోలో మార్ఫింగ్ చేయడం, అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రధానంగా స్టార్ హీరోయిన్ ల పేస్ లు మార్పింగ్ చేస్తూ.. వాటికి అసభ్యకరమైన వీడియోలను యాడ్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొంతమంది! ఈ క్రమంలో తాజాగా రష్మిక మందాన విషయంలోనూ ఇదే జరిగింది.
అవును... ఇండస్ట్రీలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఒకరైన రష్మికకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఇండస్ట్రీ జనాలు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా దిగ్గజ నటుడు అమితాబ్ సైతం స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి మార్ఫింగ్ వీడియోల కట్టడి సామాజిక మాధ్యమాల బాధ్యతే అని స్పష్టం చేసింది.
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్ లో ఉన్నట్లు ఈ వీడియోను రూపొందించారు. ఇప్పటివరకూ ఏ సినిమాల్లో కూడా ఆమె ఇటువంటి దుస్తుల్లో కనిపించకపోవడం గమనార్హం. వీలైనంత అసభ్యకరంగా ఈ వీడియోను మార్ఫింగ్ చేశారు. దీంతో... ఇది చూసిన నెటిజన్లు.. ఇలా మార్ఫింగ్ చేయడం నేరమని అంటున్నారు.
ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను ఓ జర్నలిస్ట్ పోస్ట్ చేశారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదని, జారా పటేల్ అనే యువతి అని స్పష్టం చేశారు. అదేవిధంగా... ఇలాంటి తప్పుడు చర్యలను అరికట్టేందుకు చట్టపరంగా ఓ ఫ్రేం వర్క్ ను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్ర ఐటీ శాఖ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది!
ఇందులో భాగంగా.. రష్మిక మార్ఫింగ్ వీడియోపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా ఎ క్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఇంటర్నెట్ ను వినియోగించే డిజిటల్ పౌరులకు భద్రత కల్పించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ లో జారీ చేసిన ఐటీ నిబంధల ప్రకారం.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లు కొన్ని చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కొత్త ఐటీ నిబంధనల ప్రకారం... తమ తమ ఫ్లాట్ ఫాంస్ లో ఏ యూజర్ కూడా నకిలీ లేదా తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయకుండా చూసుకోవాలి.. ఒకవేళ అలాంటి ఫేక్ సమాచారాన్ని గుర్తిస్తే.. దాన్ని 36 గంటల్లోగా తొలగించాలి. ఈ నిబంధనలను పాటించకపోతే రూల్ నెంబర్ 7 కింద.. ఆ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లను కోర్టుకు లాగొచ్చు" అని రాజీవ్ చంద్రశేఖర్ ఆన్ లైన్ వేదికగా తెలిపారు.
కాగా.. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... రణ్ బీర్ సరసన ఆమె నటించిన "యానిమల్" సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదేవిధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా "పుష్ప-2"లోనూ ఆమె నటిస్తోన్నారు. ఇవి కాకుండా మరో మూడు పెద్ద ప్రాజెక్ట్ ల్లో అవకాశాలను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.