రతన్ టాటా పార్థివ దేహానికి అంత్యక్రియలు... ఎప్పుడు, ఎక్కడ, ఎలా?
తదుపరి టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
By: Tupaki Desk | 10 Oct 2024 5:53 AM GMTముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ గ్రహీత, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్, ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన పారిశ్రామికవేత్త, భారత పారిశ్రామిక రంగానికి టైటాన్, గొప్ప మానవతావాది.. రతన్ టాటా (86) బుధవారం రాత్రి దాతృత్వంలో చెరగని గుర్తులను మిగిల్చి వెళ్లిపోయారు.
తదుపరి టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలోని హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూనే రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సమయంలో ఆయన పార్ధివ దేహానికి అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నారు.
అవును... రతన్ టాటా పార్ధివ దేహానికి అంత్యక్రియలు గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. ఇదే సమయంలో... దివంగత పారిశ్రామికవేత్తకు గౌరవ సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది.
ఇదే క్రమంలొ... రతన్ టాటాకు గౌరవ సూచకంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే కొల్బాలోని నివాసానికి రతన్ టాటా పార్ధివ దేహాన్ని తరలించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.
అయితే... అప్పటి వరకూ ప్రజల సందర్శనార్ధం ఆయన పార్ధివ దేహాన్ని దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీఏపీ) గ్రౌండ్స్ లో ఉంచారు! ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల తర్వాత రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారు.