Begin typing your search above and press return to search.

రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

అలాంటి ఆయనఎందుకు పెళ్లి చేసుకోలేదు? జీవితాంతం పెళ్లికాకుండా అలా ఎందుకు ఉండిపోయారు? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతికితే..

By:  Tupaki Desk   |   10 Oct 2024 4:51 AM GMT
రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
X

అనితర సాధ్యమైన విజయాల్ని సాధించిన వారి జీవితాల్ని చూడండి. వారి వైవాహిక జీవితం సజావుగా ఉండటం కనిపించదు. అదే సమయంలో కొందరు పెళ్లి చేసుకోకుండాఉండటం కనిపిస్తుంది. దానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తారు వ్యాపారదిగ్గజం రతన్ టాటా. 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన ఆయన నిష్క్రమణం దేశాన్ని వేదనకు గురి చేసింది. దసరా పండుగ ఫీలింగ్ అన్నది లేకుండా చేసింది. మనసు మూలల్లో తీర్చలేని బాధగా ఆయన మరణం మారింది.

వ్యాపారంలోనూ.. వ్యక్తిగతంగానూ రతన్ టాటాను వేలెత్తి చూపేందుకు.. వంక పెట్టేందుకు అవకాశమే కనిపించదు. అలాంటి ఆయనఎందుకు పెళ్లి చేసుకోలేదు? జీవితాంతం పెళ్లికాకుండా అలా ఎందుకు ఉండిపోయారు? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతికితే.. అయ్యో అనిపించే ఉదంతాలు కనిపిస్తాయి. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవటంతో ఆయన తన నానమ్మ వద్ద పెరిగారు. తన తల్లిదండ్రుల విడాకుల మీద ఆయన సున్నితంగా స్పందించటం కనిపిస్తుంది.

తన బాధను దాచే ప్రయత్నం చేయలేదు కానీ.. అలా అని తల్లిదండ్రుల నిర్ణయాన్ని నిందించకపోవటం కూడా కనిపిస్తుంది. ‘‘మా తల్లిదండ్రుల విడాకుల కారణంగా నేను, నా తమ్ముడు కొంత ఇబ్బంది పడ్డాం. ఆ రోజుల్లో విడాకులు సహజం కాదు. మా అమ్మ రెండో పెళ్లి చేసుకున్నారు. స్కూల్లోని పిల్లలు ర్యాగింగ్ చేసేవారు.అయినా మా నానమ్మ మాత్రం మమ్మల్ని గౌరవంగా.. గొడవలు లేకుండా బతికేలా నేర్పింది. అది నేటికి నాలో ఉంది’ అంటూ ఒక ఇంటర్వ్యూలో తన తీరును చెప్పారు.

రతన్ టాటా జీవితాన్ని చూస్తే నాలుగుసార్లు ఆయన ప్రేమలో పడ్డారు. పెళ్లి వరకు ఆయన తన ప్రేమను తీసుకెళ్లలేకపోయారు. దీనికి కారణం ఆయనలోని కొన్ని భయాలు అయితే.. మరికొన్ని సందర్భాల్లో కాలం కలిసి రాకపోవటం.. ఆయన ప్రేమించిన వారు రతన్ టాటాను సరిగా అర్థం చేసుకోకపోవటం.. ఆయన బాధ్యతల పరిమితులకు అంగీకరించకపోవటం కూడా కారణంగా చెప్పొచ్చు.

ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమల గురించి చెబుతూ.. తాను నాలుగుసార్లు లవ్ లో ఫెయిల్ అయ్యానని చెప్పారు. తన జీవితంలో నాలుగు సార్లు ప్రేమ తలుపు తట్టినప్పటికి క్లిష్టపరిస్థితుల కారణంగా తమ బంధం పెళ్లి వరకు వెళ్లలేదని చెప్పారు. నాలుగోసారి ప్రేమ ఫెయిల్ అయ్యాక ఆయన మళ్లీ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఆ తర్వాత మాత్రం ఆయన ఫోకస్ మొత్తం టాటా గ్రూప్ వ్యాపారా సామ్రాజ్యాన్ని విస్తరించటం మీదనే దృష్టి పెట్టటం కనిపిస్తుంది.

రతన్ టాటా అమెరికాలో పని చేస్తున్నప్పుడు జీజీ అనే మహిళను అమితంగా ప్రేమించారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ సమయంలో తన ప్రేమ గురించి చాలా తీవ్రంగా ఉండేవారు. నానమ్మ ఆరోగ్యం బాగోలేకపోవటంతో ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. ప్రేమించిన ఆమె.. ఇండియాకు రావటానికి ఇష్టపడలేదు. అదే సమయంలో ఇండో - చైనా యుద్ధం మొదలైంది. ఆ యుద్ధ సమయంలో ఆమెను ఇండియాకు పంపేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో.. ఆమె అమెరికాలో మరొకరిని పెళ్లాడారు. ఆ తర్వాత రతన్ టాటా ఫోకస్ మారింది. రతన్ టాటా జీవితంలో అత్యంత సీరియస్ లవ్ స్టోరీ ఇదేనని చెబుతారు.

తన జీవితంలో నాలుగుసార్లు పెళ్లి గురించి సీరియస్ గా ఆలోచించానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే.. ప్రతిసారీ ఏదో ఒక రకమైన భయంతో వెనక్కి తగ్గినట్లు చెప్పారు. బాలీవుడ్ నటితోనూ ఆయన లవ్ ఎపిసోడ్ ఉందని చెబుతారు. ప్రఖ్యాత హ్యుమన్స్‌ ఆఫ్‌ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి రతన్ టాటా రివీల్ చేశారు. ‘మీరెప్పుడైనా నాకు క్రష్ ఉందా అని ప్రశ్నిస్తే.. నేను పెళ్లి గురించి నాలుగు సార్లు సీరియస్‌గా ఆలోచించానని చెబుతాను. అయితే ప్రతిసారీ ఏదో ఒక రకమైన భయంతో నేను వెనక్కి తగ్గానని కూడా చెబుతాను. వివాహం జరగకపోవడానికి సరైన సమయం దొరకకపోవడం కూడా ఒక కారణం. నేను కొన్ని సార్లు ప్రయత్నించినప్పటికీ, అది వర్కౌట్ కాలేదు" అని తన జీవితంలో ప్రేమ.. పెళ్లి గురించి వివరంగా వెల్లడించారు.

పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన రతన్ టాటా.. తన జీవితంలో తనకు నచ్చిన రీతిలో జీవించారనిచెప్పాలి. తన అభిరుచులను ఫాలో అయ్యేవారు. అందులో కార్లు మొదలు పియానో ప్లే చేయటం వరకు అన్నీ ఉన్నాయి. ఆ జాబితాలో ఫ్లెయింగ్ కూడా ఉంది. రిటైర్మెంట్ తర్వాత మిగిలిన జీవితాన్ని తన అభిరుచులకు తగ్గట్లు కొనసాంచాలనుకున్నట్లు చెప్పిన ఆయన.. అలానే తన జీవితాన్ని సాగించారు.