Begin typing your search above and press return to search.

పెంపుడు శునకానికి ఆరోగ్యం బాగాలేదని... రతన్ జీ సంచలన నిర్ణయం!

ఆయనకు ఈ అలవాటు చిన్నతనం నుంచీ ఉందని చెబుతారు. ఈ క్రమంలో ఓ అరుదైన సంఘటన జరిగింది.

By:  Tupaki Desk   |   10 Oct 2024 4:03 PM GMT
పెంపుడు శునకానికి ఆరోగ్యం బాగాలేదని... రతన్  జీ సంచలన నిర్ణయం!
X

మనిషిని మనిషిగా చూసేవాళ్లే కరువైపోతున్న ఈ రోజుల్లో... మూగజీవాలపై అమితమైన, అంతులేని ప్రేమను చూపించేవారు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా. మూగజీవాలను ఆయన అమితంగా చూసుకునేవారు. ఆయనకు ఈ అలవాటు చిన్నతనం నుంచీ ఉందని చెబుతారు. ఈ క్రమంలో ఓ అరుదైన సంఘటన జరిగింది.

అవును... రతన్ టాటాకు మూగజీవాలపై, ప్రధానంగా శునకాలపై అమితమైన ప్రేమ అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకసారి ఆయన పెంపుడు శునకం ఒకదానికి అనారోగ్యంగా ఉండటంతో ఆయన తీసుకున్న నిర్ణయం పీక్స్ అనే చెప్పాలి. అంతకంటే ముందు.. మూగజీవాలపై ఆయనకున్న ప్రేమకు అది నిదర్శనం అని ఒప్పుకోవాలి.

వివరాళ్లోకి వెళ్తే.. రతన్ టాటాకు మూగజీవాలపై ఉన్న ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు వ్యాపారవేత్త నిరంజన్ హీరానందాని. తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా... తనకు వచ్చిన అవార్డును స్వీకరించడానికి రతన్ టాటా లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారంట.

అయితే ఉన్నట్టుండి చివరి నిమిషంలో ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారట. దీంతో ఆశ్చర్యపోయినవారంతా ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారట. అయితే ఫైనల్ గా ఆయన లండన్ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడానికి గల కారణం.. ఆయన పెంపుడు శునకం అనారోగ్యానికి గురైందని తేలిందంట. దీంతో మరోసారి షాకవ్వడం తెలిసినవారి వంతైందంట.

ఆ సమయంలో అనారోగ్యానికి గురైన ఆ శునకాన్ని.. మంచంపై తన పక్కనే పడుకోబెట్టుకుని మరీ జాగ్రత్తగా చూసుకునేవారంట రతన్ టాటా. ఇది మూగజీవాలపై ఆయనకున్న ప్రేమకు, నిరాడంబరతకు మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే అని హీరానందన్ కొనియాడారు.

కాగా... ఇదే కాదు... రతన్ టాటా తన వ్యాపార సామ్రాజ్య ప్రధాన కార్యాలయమైన బాంబేహౌస్ లో వీధి శునకాల కోసం ఏకంగా ఓ ప్రత్యేక గదినే కేటాయించిన సంగతి తెలిసిందే. అక్కడ అవి ఆడుకొవడానికి, రెస్ట్ తీసుకోవడానికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో వర్షాకాలం వచ్చిందంటే ఆయన వాహదారులకు ఎప్పుడూ ఓ రిక్వస్ట్ చేస్తుండేవారు.

ఇందులో భాగంగా... వర్షాలు వచ్చినప్పుడు కార్ల కింద వీది కుక్కలు, పిల్లులు తల దాచుకుంటాయని.. అందువల్ల కారు స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి కారు కింద చెక్ చేసుకోవాలని.. అలా కానిపక్షంలో అవి గాయపడటమో, చనిపోవడమో జరుగుతుంటుందని ఆయన చెప్పేవారు!

ఇక, రాజరికం ఉట్టిపడే తాజ్ హోటల్ ప్రవేశ ద్వారం పక్కన ఓ వీధి శునకం నిద్రపోవడానికి సంబంధించిన దృశ్యాలు గతంలో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.