Begin typing your search above and press return to search.

భారతీయుల మదిలో రతన్ టాటాకు శిఖరస్థాయి ఎందుకు?

భారతీయుల హృదయం టాటాను శిఖర స్థాయిలో నిలిపేలా చేయటంలో రతన్ టాటా కీ రోల్ ప్లే చేశారు.

By:  Tupaki Desk   |   10 Oct 2024 4:54 AM GMT
భారతీయుల మదిలో రతన్ టాటాకు శిఖరస్థాయి ఎందుకు?
X

వ్యాపారస్తుడు ఒక మనిషి జీవితంలో ఒక భాగం. అలా అని ప్రతి వ్యాపారస్తుడ్ని ప్రజలు తమ మనసుల్లోకి తీసుకోరు. వ్యాపారిని వ్యాపారిగానే చూస్తారు. అంతకు మించిన ఆత్మీయత.. సదరు వ్యాపారికి చెందిన వ్యాపారాల్ని తమకు చెందినవిగా భావించేలా చేయటమే రతన్ టాటా అసలుసిసలు మేజిక్ గా చెప్పాలి. ఆయన భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన వ్యాపారాన్ని విలువలతో చేయటం.. నమ్మకానికి ప్రతిరూపంగా మార్చటం ఆయనకు మాత్రమే సాధ్యం. దేశంలో బోలెడన్ని వ్యాపారసంస్థలు.. పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారందరు ఒక కేటగిరి.. రతన్ టాటా వేరే కేటగిరిగా చెప్పాలి.

భారతీయుల హృదయం టాటాను శిఖర స్థాయిలో నిలిపేలా చేయటంలో రతన్ టాటా కీ రోల్ ప్లే చేశారు. అలా ఎలా చేయగలిగారు. భారతీయులు అంటే కోటి పది కోట్లు కాదు. ఏకంగా వంద కోట్లకు పైగా. ప్రపంచ జనాభాలో 17 శాతం ప్రజలు భారతీయులే. ప్రపంచంలో మరే దేశంలో లేనంత వైవిధ్యం భారత్ సొంతం. మతం కావొచ్చు.. ప్రాంతం కావొచ్చు.. భౌగోళిక అంశాలు కావొచ్చు.

భాషలు కూడా మన దేశంలో ఉన్నన్ని మరే దేశంలో ఉండే ఛాన్సు లేదు. అలాంటి ఇంత విలక్షణ.. వైవిధ్యభరితమైన దేశంలో తన వ్యాపార మార్కును చూపించటం ఒక ఎత్తు.. భారతీయుల మనసుల్లో ఒక రత్నంగా నిలిచిపోవటం మరో ఎత్తు. అందుకే.. పారిశ్రామిక రంగంలో రతన్ టాటా ఇస్పెషల్.

రతన్ టాటా అన్నంతనే గుర్తుకు వచ్చే కొన్ని సంగతుల్ని చెప్పాల్సిన వస్తే..

- వ్యాపార పనుల కోసం లంచం ఇవ్వటం టాటా గ్రూప్ వైఖరికి భిన్నం. అందుకోసం న్యాయపోరాటం చేస్తారే తప్పించి.. తగ్గేదే లేదన్నట్లుగా ఉంటుంది వారి తీరు. ఈ రోజు వాట్సాప్ గ్రూప్ లోని ఒక మిత్రుడు.. టాటా సంస్థలకు ఆడిటింగ్ చేసేవాడు. ఆయన ఆడిటింగ్ లో భాగంగా టాటా సెల్యులార్ కంపెనీ ఆఫీసుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు లంచం ఇవ్వని కారణంగా. అయినప్పటికీ లంచం ఇవ్వకుండా న్యాయపోరాటం ద్వారా కనెక్షన్ సాధించారు. అదీ రెండేళ్ల తర్వాత. మరి.. అంతకాలం ఏం చేశారో తెలుసా? తమ వ్యాపార సంస్థను జనరేటర్ మీద నడిపించారే తప్పించి లంచం ఇచ్చి పని పూర్తి చేయాలని మాత్రం అనుకోలేదు. ఇలాంటివి ఏ కంపెనీకి సాధ్యమవుతుంది చెప్పండి?

- మిగిలిన పారిశ్రామికవేత్తలకు రతన్ టాటాకు వ్యత్యాసం ఏమంటే.. ఆయన ఎంతో వినయంగా ఉంటారు. ప్రచారాలకు.. ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. సాధారణ జీవనశైలితో ఉండేందుకు ఇష్టపడతారు. దేశంలోని అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా ఆయన ఉన్నప్పటికీ.. ఆ దర్పాన్ని మాత్రం ప్రదర్శించరు.

- రతన్ టాటా దానాలకు పెట్టింది పేరు. గ్రూప్ సంపదలో అధిక భాగం టాటా ట్రస్ట్ ల ద్వారా ధార్మికకార్యక్రమాలకు కేటాయించేవారు. ఎప్పుడూ నైతిక వ్యాపార పద్దతులను పాటిస్తూ.. సామాజిక బాధ్యత తీసుకోవాలని చెబుతుంటారు.

- ఒకసారి ఆయన కారులో వెళుతున్నప్పుడు జోరున వర్షం పడుతోంది. ఆ టైంలో టూ వీలర్ మీద వెళుతున్న ఒక మధ్యతరగతి కుటుంబం వర్షంలో తడవకుండా ఉండేందుకు షెడ్ కింద ఉండటం.. చలితో వణకటం చూసిన ఆయన.. మధ్యతరగతి కుటుంబానికి అనువుగా ఒక కారును తేవాలని భావించారు. ఎంతో మదనం తర్వాత అతి తక్కువ ఖర్చుకే కారును ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేశారు. అదే టాటా నానో. సామాన్యుల గురించి అంతలా ఆయన ఆలోచిస్తారు. అందుకు ఎన్ని సవాళ్లకైనా సిద్ధమంటారు.సాహసోపేతమైన నిర్ణయాలకు వెనుకాడరు.

- 2008లో తాజ్ హోటల్ లో ఉగ్రదాడి జరిగింది. ఆ టైంలో రతన్ టాటా ప్రదర్శించిన ఉదారత గురించి చాలా గొప్పగా చెబుతారు. హోటల్ సిబ్బందితో పాటు బాధితులుగా మారిన వారందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి ఉంటారు.

- తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఆయన ఎప్పుడూ భారతీయ విలువలు.. సంస్క్రతిని విస్మరించలేదు. భారతీయుడిగా గర్వపడుతూ.. ఆధునిక వ్యాపారంలోనూ ప్రపంచంలో పోటీ పడ్డారు.

- ఉద్యోగుల పట్ల ఎంతో శ్రద్ధ చూపేవారు. సంక్షోభ సమయాల్లో ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడేవారు.

- టాటా స్టీల్ కంపెనీలో పని చేసే ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ బాధ్యత తీసుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఇదో అరుదైన విధానంగా చెబుతారు.