నిజంగా రత్నమే : మంచితనమే ఆయన సంపద
అలాంటి వారు చనిపోతే కార్పోరేట్ సంస్థలు స్పందిస్తాయి కానీ సగటు జనాలు కన్నీరు పెడుతున్నారేంటి.
By: Tupaki Desk | 10 Oct 2024 1:15 PM GMTదేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ అయిన రతన్ టాటా ఈ లోకాన్ని వీడిపోయారు 86 ఏళ్ల వయసులో ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం దేశాన్ని కుదిపింది. ఆయన అత్యంత సంపన్నుడు. పారిశ్రామికవేత్త.
అలాంటి వారు చనిపోతే కార్పోరేట్ సంస్థలు స్పందిస్తాయి కానీ సగటు జనాలు కన్నీరు పెడుతున్నారేంటి. ఈ ప్రశ్నకు జవాబు చాలా లోతు అయినది. నిజమే ఆయన అత్యంత సంపన్నుడే. దానికి మించి మంచితనాన్ని నిండుగా సంపాదించుకున్న మహా ధనికుడు. అందుకే రతన్ టాటా ఇక లేరు అంటే దేశం మొత్తం ఆవేదనతో తల్లడిల్లుతోంది
నిండు జీవితాన్ని పండించుకున్న రతన్ టాటా మనిషి ఎలా బతకాలో ఒక స్పూర్తిగా నిలిచి చూపించారు. డబ్బు ఎంత ఉన్నా నేల మీదనే కాళ్ళు ఉండాలని బుర్రకు గర్వం తలకెక్కకూడని భావించారు. అందుకే ఆయన సాధారణ జీవితాన్నే గడిపారు. పేదల పట్ల దేశం పట్ల తన చిత్తశుద్ధిని ఎపుదూ చూపిస్తూనే ఉన్నారు.
ఆయన వినయ విధేయ రాముడిగానే నిలిచారు. అలా కోట్లాది మనసులు గెలిచారు. తనకు ఉన్న కోట్లాది సంపద వల్ల ఆయన ఈ రోజు గొప్పవారు కాలేదు. తన ఉన్నతమైన వ్యక్తిత్వం వల్లనే ఆయన అందరి మదిని చూరగొన్నారు. దేశం ముందు తరువాత నేను అన్న ఆయన విధానమే ఈ రోజు భారతదేశానికి ఒక గొప్ప రత్నం గా భూమి పుత్రుడిగా ఆయనను మిగిల్చింది.
ఆయన కోట్లాది సంపదకు వారసుడిగా లేరు, మంచితనానికి ప్రేమకు వారసుడిగా తరాలకు గుర్తుండిపోతారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. అందుకే టాటా గ్రూప్స్ ని లక్షల కోట్ల లాభాల బాట పట్టించారు. అదే సమయంలో దేశం పట్ల ప్రేమ ఉంది. అందుకే తన సంపదలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అలా దేశానికి అవసరమైన అన్ని సందర్భాలలో విరాళంగా ఇచ్చారు
ఆయనలోని సమాజం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఈ రోజు ఆయన లేకున్నా జనం గుండెల్లో నిలిపాయి. ఆయన లేని లోటుని భర్తీ చేయడం కష్టం అన్న మాటను కూడా అనిపించగలిగాయి. ఆయన నాయకత్వంలోని టాటా ట్రస్ట్‌లు దేశంలోని అతి పెద్ద స్వచ్ఛంద సంస్థలలో ఒకటిగా ఉన్నాయి.
ఆ సంస్థల ద్వారా ఆయన ఎప్పుడూ ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి సాంఘిక సంక్షేమంపై దృష్టి సారిస్తూ వచ్చారు అంతే కాదు టాటా గ్రూప్ యొక్క లాభాలలో 60శాతం కంటే ఎక్కువ ఈ ట్రస్ట్‌లకే ఇచ్చి వాటి ద్వారా సమాజ సేవ చేశారు. తన సంపదను సమాజ హితం కోసం ఉపయోగించడంలో ఆయన మహా మనీషి అని అర్ధం అవుతుంది.
ఆయన దేశంలో లక్షలాది మంది పేదల జీవితాలలో మార్పు తీసుకుని రావాలనుకున్నారు. బీదలు సాదల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఆయనలోని మానవత్వాన్ని చాటి చెబుతాయి. స్వచ్ఛమైన తాగునీరు అందించడం, ఆసుపత్రులను నిర్మించడం నిరుపేద పిల్లలకు విద్యకు నిధులు అందించడం వంటివన్నీ ఆయన టాటా ట్రస్ట్ ద్వారా చేశారు.
ఆయన ఎప్పుడూ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించడం గురించి మాత్రమే ఆలోచించలేదు. తన దేశాన్ని అందులోని ప్రజలను ఉద్ధరించడం గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచించారు. ఇక దేశానికి ఎపుడు సమస్య వచ్చినా ఆయన నేను ఉన్నాను అని నిలిచారు. 2008 ముంబై ఉగ్రవాద దాడులు జరిగాయి. అక్కడ టాటా ఆస్తి అయిన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ కూడా విధ్వంసం అయింది.
ఆ వెంటనే రతన్ టాటా వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారిని సాయం చేశారు. ఆ కుటుంబాలకు అండగా ఉండేలా చూసుకున్నారు. మళ్ళీ ఆ హొటల్ ని శత్రు దుర్బేధ్యంగా నిర్మించారు కూడా. ఇలా ఎంతో సంపద మరెన్నో విజయాలు ఉన్నా కూడా రతన్ టాటా సామాన్యుడిగానే గడిపారు.
ఆయనకు జంతువులపై అతని ప్రేమ ఎక్కువ. అలాగే సాటి మనుషుల మీద అవ్యాజమైన ప్రేమ. అది ఆయనలోని మహా మనీషిని లోకానికి చూపించింది. 1937లో గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించిన రతన్ టాటా చిన్నతనంలో నాన్నమ్మ అమ్మమ్మ వద్దనే పెరిగారు. ఆయన కార్నెల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అలాగే లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడాలని కలలు కన్నారు కానీ అమ్మమ్మ అనారోగ్యం పాలైనప్పుడు తిరిగి భారతదేశానికి వచ్చారు. అలా తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు
రతన్ టాటా 1963లో టాటా స్టీల్‌తో ప్రారంభించినది మొదలు దానిని ఒక సవాల్ గా తీసుకున్నారు. 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారతదేశం ఆర్థిక సరళీకరణ విధానం వైపు ఉంది. అయితే ఆయన ఆ సమయంలో మరింత సమర్థంగా పనిచేసి లక్షల ఆస్తిగా టాటా గ్రూప్స్ ని మలచారు. రతన్ టాటా సారథ్యంలో టాటా గ్రూప్ అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తం అయింది.
టాటా బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. టాటా స్టీల్ నుంది సాఫ్ట్‌వేర్ వరకు టెలికమ్యూనికేషన్స్ నుండి ఏవియేషన్ వరకు అలాగే ఫ్యాషన్ రంగం వరకు పూర్తి స్థాయిలో తన వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరించారు. ఇక రతన్ టాటా యొక్క గొప్ప విజయం 2008లో విడుదలైన ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు అయిన టాటా నానోగా చెప్పాలి. అది ఒక లక్ష రూపాయలకే అందించారు. అలా సామాన్యుడి కోసం కారుని తయారు చేయడంలోనే ఆయన ఫోకస్ పేదల మీద ఉంది అని అర్ధం చేసుకోవాలి.
రతన్ టాటా వారసత్వం ఒక కార్పొరేట్ టైటాన్‌గా మాత్రమే కాదు నిజమైన మానవతావాదిగా కూడా ఉంది అని గట్టిగా చెప్పాలి. టాటా గ్రూప్ నాయకత్వంతో ఆధునిక ప్రపంచంలో వ్యాపార వర్గానికే లీడర్ గా పరిమితం కాలేదు. సామాజిక బాధ్యతతో కార్పొరేట్ విజయాన్ని సమతుల్యం చేయడం ద్వారా వ్యాపారాలు మంచి కోసం ఒక శక్తిగా ఉంటాయని ఆయన నిరూపించారు. జీవితంలో దయ కరుణ మానవత్వం ఉండాలని టాటా స్పష్టం చేశారు. అందుకే ఆయన గ్రేట్. అసలైన భారతరత్నం అని చెప్పాలి.