'పేరు బలం' పనిచేయట్లేదా? టికెట్ల కేటాయింపులో రగడ దేనికి?
ఉదాహరణకు రాథోడ్ బాపూరావు, బాబూ మోహన్ సహా అనేక మంది నాయకులు ఊగిసలాటలోనే ఉండిపోయారు.
By: Tupaki Desk | 29 Oct 2023 2:45 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటు అధికార పార్టీ బీఆర్ ఎస్, అటు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలు కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. ఒకప్పుడు పేరును బట్టి, వ్యక్తిని చూసి టికెట్లు ఇచ్చేసే పరిస్థితి అన్ని పార్టీల్లోనూ ఉంది. దీంతో కోరుకున్నవారికి దాదాపు టికెట్లు లభించాయి. ఇది 2014, 2018 ఎన్నికల్లోనూ తెలంగాణలో కొనసాగింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా అన్ని రాజకీయ పార్టీలు.. పేరు బలం.. వ్యక్తి పూజ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో కోరుకున్నవారందరికీ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
అటు అధికార బీఆర్ ఎస్ అయినా.. ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలైనా ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి. నిజానికి తమకు ఒక పార్టీలో టికెట్ దక్కకపోతే.. మరో పార్టీలోకి జంప్ చేసి టికెట్లు తెచ్చుకున్న పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు ఆ పప్పులు ఉడకం లేదు. పొరుగు పార్టీల్లోకి వెళ్లినా.. కండువాలు మార్చేసినా.. కుర్చీ(సీటు) దక్కుతుందనే పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకు రాథోడ్ బాపూరావు, బాబూ మోహన్ సహా అనేక మంది నాయకులు ఊగిసలాటలోనే ఉండిపోయారు.
వీరికి సొంత పార్టీలు టికెట్లు ఇవ్వలేదు. దీంతో రాథోడ్ బాపూరావు.. కాంగ్రెస్ పంచన చేరి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, అక్కడా తిరోగమనం కనిపించింది. ఇక, బాబూమోహన్ కాంగ్రెస్ కు టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. అయితే..అ క్కడకూడా ఆయనకు టికెట్ హామీ లభించలేదు. ఇలానే పలువురు నాయకులు కనిపిస్తున్నారు.
మరి దీనికి కారణం ఏంటి? అంటే.. సర్వే మహిమ అంటున్నారు పరిశీలకులు. క్షేత్రస్థాయిలో ప్రజానాడిని పట్టుకుని.. ఓట్లు రాబట్టుకునే పరిస్థితి ఆయా నాయకులకు లేకపోవడంతోనే పార్టీలు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని చెబుతున్నారు.
వాస్తవానికి వ్యక్తినిచూసి, కులాన్ని బట్టి.. ఒకప్పుడు టికెట్లు ఇచ్చేవారు. కానీ, తాజా ఎన్నికల్లో కులాల ప్రస్తావన ఎలా ఉన్నా.. పోరు తీవ్రంగా ఉండడంతో గెలుపు గుర్రం ఎక్కుతారనే భరోసా ఉంటేనే.. అది కూడా ప్రజల నుంచి ఆమోదం లభిస్తేనే టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో మూడు పార్టీలూ ఒకే పంథాను ఎంచుకున్నాయా? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. పేరు బలం పనిచేయడం లేదు. ప్రజామోదమే కీలకంగా మారిందనే టాక్ వినిపిస్తుం డడం గమనార్హం.