Begin typing your search above and press return to search.

ఇక నుంచి మా ఊరును సీఎం ఊరుగా పిలవండి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:19 AM GMT
ఇక నుంచి మా ఊరును సీఎం ఊరుగా పిలవండి
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ సొంతూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి గ్రామం. ఆయన్ను సీఎల్పీ నేతగా ఎన్నిక చేసినట్లుగా కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రకటించినంతనే హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద పటాసులు పేల్చి.. మిఠాయిలు పంచి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని హడావుడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదర.

ఇదిలా ఉంటే.. ఆయన సొంతూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లిలో సంబరాలు ఒక రేంజ్ లో సాగాయి. తమ పటేలు.. ఇక ముఖ్యమంత్రిఅయ్యారంటూ ఖుషీ అవుతున్నారు ఆ ఊరి ప్రజలు. అంతేకాదు.. జయజయధ్వానాలు చేస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అని.. అలానే అప్పటికీ.. ఇప్పటికీ మా మంచి పటేల్ అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇక నుంచి తమ ఊరును కొండారెడ్డి పల్లి కాదు సీఎం ఊరు అని పిలవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో కొండారెడ్డి పల్లి గ్రామస్తుల హడావుడి ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. పాలమూరు నుంచి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ నిలుస్తారని చెబుతున్నారు. అప్పటి హైదరాబాద్ స్టేట్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బూర్గుల రామక్రిష్ణారావు ఉమ్మడిమహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు. రేవంత్ కూడా అదే ప్రాంతానికి చెందిన వారు కావటంతో.. తెలంగాణ ప్రాంతానికి పాలమూరు బిడ్డ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పొచ్చు.