Begin typing your search above and press return to search.

అనూహ్యం.. దేశానికి ఆడుతూనే రాజకీయాల్లోకి భారత స్టార్ ఆల్ రౌండర్

తనలాగే బ్యాటింగ్, బౌలింగ్ చేసే పొరుగు దేశం బంగ్లాదేశ్ కు చెందిన ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ ను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో..

By:  Tupaki Desk   |   6 Sep 2024 11:47 AM GMT
అనూహ్యం.. దేశానికి ఆడుతూనే రాజకీయాల్లోకి భారత స్టార్ ఆల్ రౌండర్
X

తనలాగే బ్యాటింగ్, బౌలింగ్ చేసే పొరుగు దేశం బంగ్లాదేశ్ కు చెందిన ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ ను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో.. టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడుతూనే రాజకీయ రంగప్రవేశం చేశాడు. బంగ్లాదేశ్ కాబట్టి పెద్దగా పట్టించుకోరు కానీ.. భారత్ లో అలా కాదు. 150 కోట్లమంది ప్రేక్షకులు.. పదుల కోట్ల మంది క్రికెట్ ఆడే ఈ దేశంలో తుది పదకొండు మంది జాబితాలో చోటు దక్కడం అంటే దానికి ఎంతో ప్రతిభ. కొంత లక్ కూడా ఉండాలి. అలాంటి ఆల్ రౌండర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

ఎమ్మెల్యే గారి భర్త

టీమ్ ఇండియాలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా చేయగల రవీంద్ర జడేజా గుజరాత్ లో బీజేపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నాడు. ఓవైపు మొన్నటివరకు మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టు సభ్యుడైన అతడు.. టి20 ప్రపంచ కప్ గెలిచాక టి20లకు వీడ్కోలు పలికాడు. టెస్టులు, వన్డేల్లో కొనసాగుతూనే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేశాడు. దీని వెనుక అతడి లక్ష్యం ఏమిటో అంతుబట్టడం లేదు. ఎందుకంటే.. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎవరూ నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టరు. దీనికి భిన్నంగా జడేజా అడుగులు వేశాడు. అయితే, ఇతగి భార్య రివాబా జడేజా జామ్ నగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే. ఆమె బాటలోనే రాజకీయాల్లోకి వచ్చేశాడు జడేజా

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బైనా?

మంచి ఆల్ రౌండర్ అయిన జడేజా టి20ల్లో కాస్త వెనుకబడ్డాడు. టి20 ప్రపంచ కప్ లో పెద్దగా రాణించలేదు. దీంతోపాటు అతడిని శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ కు ఎంపిక చేయలేదు. విశ్రాంతి అనికూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే జడేజాపై వేటు వేశారని అందరూ భావించారు. ఇక టెస్టుల్లో జడేజా అవసరం ఇంకా ఉంది. అతడు బంగ్లాదేశ్ తో ఈ నెల 19న మొదలయ్యే సిరీస్ కు ఎంపికయ్యే చాన్సుంది. కానీ, అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంటరయ్యాడు. దీనివెనుక ఉద్దేశం ఏమిటో తెలియకున్నా.. జడేజాకు గాయాల సమస్యలున్నాయి. మూడేళ్ల కిందట అతడిని ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ చేసినా నిలుపుకోలేకపోయాడు. ఈ ఏడాది ఐపీఎల్ లోనూ రాణించలేదు. దీంతోనే క్రికెట్ కు 35 ఏళ్ల జడేజా గుడ్ బై చెబుతాడనే ఊహగానాలు వస్తున్నాయి.