ట్రోలింగ్ వీడియో... ఈవీఎం ట్యాంపరింగ్ వివరిస్తున్న జగన్ మామ!
అవును... 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటమికి గల కారణం ఈవీఎం అనే మాటలు ఫలితాలు వెలువడినప్పటి నుంచీ చెబుతూనే ఉన్నారు.
By: Tupaki Desk | 10 Aug 2024 8:43 AM GMTఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందించే క్రమంలో వైసీపీ నేతలు ఈవీఎంలపై నేరాన్ని నెట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే! ఈవీఎం లలో ఓట్ల లెక్కింపు వ్యవహారాన్ని శకుని పాచికలతో పోల్చారు జగన్. ఈ నేపథ్యంలో తాజాగా ఈవీఎంలు ట్యాపర్ అయ్యాయని చెబుతూ.. వాటిని ఎలా చేసి ఉంటారో వివరించే ప్రయత్నం చేశారు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అవును... 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటమికి గల కారణం ఈవీఎం అనే మాటలు ఫలితాలు వెలువడినప్పటి నుంచీ చెబుతూనే ఉన్నారు. అయితే వారిలో కొంతమంది నేతలు మాత్రం లిక్కర్ పాలసి, ఇసుక విధానం, వాలంటీర్లు మొదలన కారణాలు చెబుతున్నారు అది వేరే సంగతి. ఈ నేపథ్యంలో జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రవీంద్రనాథ్ రెడ్డి... ఈవీఎం మెషిన్స్ లో చిప్ ప్రోగ్రామింగ్ జరిగిందని అన్నారు. ఆ ప్రోగ్రామింగ్ 15% కొన్ని చోట్ల జరిగిందని, 18% కొన్ని చోట్ల, 20% కొన్ని చోట్ల జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈవీఎం లకు నెట్ ఫెసిలిటీ అవసరం లేదు కదా.. మరి ఈ ప్రోగ్రామింగ్ ఎలా జరిగిందంటూ సదరు యాంకర్ ప్రశ్నించారు!
ఈ సందర్భంగా స్పందించిన రవీంద్రనాథ్ రెడ్డి... "నీ సెల్ కు ఎలా వస్తుంది.. వైర్ ఏమీ లేదు కదా. సెల్ ఫోన్ లో ఎలాగైతే సిమ్ ఉంటుందో.. ఈవీఎంలలో చిప్ ఉంటుంది. శాంసంగ్ తీసుకున్నావనుకో... శాంసంగ్ కి సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా దానిలో ముందుగానే ఆ సిమ్ లో ఉంటుంది. ఐ ఫోన్ తీసుకుంటే దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా ముందుగానే ఉంటుంది" అంటూ తనదైన శైలిలో వివరించే ప్రయత్నం చేశారు.
ఇదే సమయంలో... "ఎక్కడైతే ఎమ్మెల్యేలు, ఎంపీల ఎలక్షన్స్ జరిగాయో.. ఆ స్టేట్స్ లోనే ట్యాంపరింగ్ చేయడం జరిగింది.. ఎందుకంటే మిగతా చోట్లంతా ఎంపీ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి.. ఆ రాష్ట్రాల్లో అప్పటికే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉంటుంది.. దానివల్ల ఇలాంటి పనులు చేస్తే వ్యతిరేకత, నిరసన వస్తుంది.. అయితే ఏపీలో మాత్రం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి" అని చెప్పుకొచ్చారు.
అదేవిధంగా... జగన్ అధికారంలో ఉన్న చివరి రెండు నెలలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ తన మాట వినలేదని.. ఆ సమయంలోనే ప్రోగ్రామింగ్ జరిగి ఉండొచ్చని.. ఆంధ్ర, సిక్కింగ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ తరహా కార్యక్రమం జరిగిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో కింద నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఓ యూజర్... "మీరు చిప్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..? సంప్రదించండి, సీనియర్ హ్యాకర్ రవీంద్రనాథ్ రెడ్డి, బ్రదర్ ఆఫ్ వైఎస్ విజయలక్ష్మి.. కమలాపురం మాజీ ఎమ్మెల్యే" అని పేర్కొన్నాడు. ఇదే క్రమంలో.. "శాంసంగ్ చిప్, ఐఫోన్ చిప్, బనానా చిప్, బంగాలదుంప చిప్ లలో స్పెషలైజేషన్ చేశారు" అంటూ కామెంట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఈ వీడియో తో పాటు ఈ వీడియో కింద వెలుస్తున్న కామెంట్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.