పోల్ జోస్యంతో భారీ రిస్కు తీసుకున్న రవిప్రకాశ్?
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జర్నలిస్టులకు ఒక ఇమేజ్ ను తీసుకొచ్చిన ఘనత రవిప్రకాశ్ దేనని చెప్పాలి.
By: Tupaki Desk | 6 May 2024 4:15 AM GMTతెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జర్నలిస్టులకు ఒక ఇమేజ్ ను తీసుకొచ్చిన ఘనత రవిప్రకాశ్ దేనని చెప్పాలి. అప్పటివరకున్న జర్నలిజం తీరు తెన్నుల్ని పూర్తిగా మార్చేసిన ఘనత ఆయనదే. రవిప్రకాశ్ ను దేవుడిలా ఆరాధించే జర్నలిస్టులు ఉన్నారు. ఆయన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే వారూ ఉన్నారు. ఆయనతో కలిసి పని చేసిన వారు.. ఆయన కింద పని చేసిన వారు.. ఆయన గురించి ప్రత్యక్షంగా తెలిసిన వారు మాత్రం ఆయన్ను ఒక మాట అనేందుకు కాసింత తటపటాయిస్తుంటారు. కొన్ని ఆరోపణల్ని పక్కన పెడితే.. జర్నలిస్టులుగా సమాజానికి ఆయన చేసిన మేలు ఎక్కువని కొంతమంది అభివర్ణిస్తుంటారు.
టీవీ9 నుంచి బయటకు వెళ్లిపోవటం.. తీవ్రమైన ఆరోపణలతో అరెస్టు కావటం.. జైలుకు వెళ్లటం లాంటి పరిణామాలతో ఆయన ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్ చానల్ పేరుతో ఆయన రీఎంట్రీ పెద్ద హడావుడి చేయకున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంచానకు సంబంధించి నిర్వహిస్తున్నప్రోగ్రాం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
రవిప్రకాశ్ అండ్ కో అంచనాల ప్రకారం ఏపీలో 110 స్థానాలకు పైనే సాధించే కూటమికి స్పష్టమైన విజయం ఖాయమని తేల్చేశారు. జిల్లాల వారీగా గెలిచే గుర్రాలు.. ఓడే వారి లెక్కల్ని ఆయన విప్పిచెప్పారు. ఆయన అంచనాలు ఎంతవరకు నిజమని తేలటానికి మరికొంతకాలం పడుతుంది. మిగిలిన జర్నలిస్టులకు రవిప్రకాశ్ కు ఉండే తేడాతో ఆయన ఫలితాలపై రాజకీయ పార్టీలు సైతం స్పందించటం షురూ చేశాయి. ఆయనపై దాడిని అంతకంతకూ పెంచేశాయి.
మొత్తంగా చూస్తే.. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అంచనాల్ని వెల్లడించటం ద్వారా రవిప్రకాశ్ భారీ రిస్కును తీసుకున్నారని చెబుతున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన అంచనాలు ఏ మాత్రం తేడా కొట్టినా.. ఆయన భారీ మూల్యాన్ని చెల్లించాలని చెబుతున్నారు. ఇంతకాలం ఆయనపై ప్రజల్లో ఉన్న నమ్మకం మొత్తం దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు అని.. ఓటరు నాడిని పట్టుకున్నట్లుగా చెబుతున్న రవిప్రకాశ్.. దానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు తేడాగా వస్తే ఆయన ఇమేజ్ డ్యామేజ్ కావటమే కాదు.. ఇంకెప్పటికి ఆయన మాటల్ని నమ్మలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు.
కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న రవిప్రకాశ్.. తాజాగా వెల్లడించిన ఎన్నికల అంచనాలు ఏ మాత్రం తప్పినా ఆయనకు.. ఆయన చానల్ మనుగడకు పెను ప్రమాదం ఖాయమంటున్నారు. ఇంత రిస్కు తీసుకున్న రవిప్రకాశ్ ఫ్యూచర్ ఏమవుతుందన్న విషయం తేలాలంటే జూన్ మొదటి వారం వరకు వెయిట్ చేయకతప్పదు.