Begin typing your search above and press return to search.

ఎంపీ కాకున్నా.. కేంద్ర మంత్రి.. ఆయన ‘ఎంపీ’కే ఆశ్చర్యం..

ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో విడత ప్రమాణంలో కొన్ని సంచలన అంశాలు కనిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   10 Jun 2024 9:24 AM GMT
ఎంపీ కాకున్నా.. కేంద్ర మంత్రి.. ఆయన ‘ఎంపీ’కే ఆశ్చర్యం..
X

ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో విడత ప్రమాణంలో కొన్ని సంచలన అంశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేరళ, పంజాబ్ విషయంలో. మూడు-నాలుగు దశాబ్దాలుగా కేరళలో లోక్ సభ సీటు గెలవాలని బీజేపీ విశ్వప్రయత్నం చేస్తోంది. నటుడు సురేశ్ గోపీ ద్వారా ఈసారి ఆ ప్రయత్నం నెరవేరింది. పంజాబ్ లో తొలిసారి అకాలీదళ్ తో పొత్తు లేకుండా పోటీ చేసింది. కానీ, ఫలితం శూన్యం. అయితే, పంజాబ్, కేరళ రెండు రాష్ట్రాలకూ మంత్రివర్గంలో స్థానం దక్కింది.

కాంగ్రెస్ టు బీజేపీ..

రవనీత్ సింగ్ బిట్టూ.. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రుల్లో ఒకరు. ఈయన లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. లూథియానాలో పోటీ చేయగా.. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా చేతిలో ఓడిపోయారు. అయితే, ఈయన రాజ్యసభ సభ్యుడు కూడా కాదు. కానీ, మంత్రి పదవి ఇచ్చి బీజేపీ హైకమాండ్ అత్యంత విశ్వాసం ఉంచింది. పంజాబ్‌ లో రాబోయే రోజుల్లో రవనీత్ కీలకం అవుతారని ఊహిస్తోంది. బిట్టూ ఇప్పుడు ఆరు నెలల్లో ఎంపీగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది.

తాత సీఎం.. ఉగ్రవాదుల చేతిలో హతం

రవనీత్ బిట్టూ ఎవరో కాదు.. పంజాబ్ దివంగత సీఎం బియాంత్ సింగ్ మనవడు. బియాంత్.. పంజాబ్ లో వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎంగా ఉండగానే హత్యకు గురయ్యారు. ఇప్పుడు పంజాబ్ లో మరోసారి వేర్పాటు వాదం రగులుతోంది.

ఖలిస్థానీ సానుభూతిపరులు అమృత్‌ పాల్ సింగ్, సరబ్‌ జిత్ సింగ్ ఖల్సా ఈసారి ఎంపీలుగా గెలిచారు. అమృత్‌ పాల్‌ అసోంలోని దిబ్రూగడ్ జైల్లో నుంచే నెగ్గాడు.

ఇందిర హంతకుడి కుమారుడు..

సరబ్ జిత్ ఖల్సా ఎవరో కాదు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడు. ఫరీద్ కోట్ నుంచి ఇతడు ఎంపీగా గెలిచాడు.

పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ నకు ఖలిస్థానీ సానుభూతిపరుల మద్దతు ఉన్నదనే ఆరోపణలున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఉగ్రవాద బాధిత కుటుంబానికి చెందిన రవనీత్‌ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నాట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కేరళ నుంచి కేంద్ర మంతి అయిన జార్జ్‌ కురియన్‌ క్రైస్తవుడు. ఈయన కూడా ఎంపీ కాదు. కానీ, సహాయ మంత్రి పదవి దక్కింది.

కేరళలో క్రైస్తవులు అధికం. ఆ వర్గానికి చేరువయ్యే లక్ష్యంతోనే బీజేపీ కురియన్ ను మంత్రిని చేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది.