Begin typing your search above and press return to search.

వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన రాయలసీమ

కానీ ఈసారి బొమ్మ తిరగబడుతోంది అని అర్ధం అవుతోంది.

By:  Tupaki Desk   |   4 Jun 2024 5:57 AM GMT
వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన రాయలసీమ
X

జగన్ సీఎం కావాలని రెండు ఎన్నికల్లో ఆయనకు అండగా నిలిచిన రాయలసీమ 2024 నాటికి భారీ షాక్ ఇచ్చేసింది. ఎక్కడైతే అద్భుతమైన విజయాలను వైసీపీ మూటకట్టుకుందో ఆ రాయలసీమ నేల మీదనే ఇపుడు వైసీపీ చతికిలపడే పరిస్థితి ఏర్పడింది.

రాయలసీమలో 2019 ఎన్నికల్లో వైసీపీ మొత్తం నాలుగు జిల్లాలలో ఉన్న 52 సీట్లకు గానూ కేవలం 3 తప్ప అన్నింటినీ గెలుచుకుంది. కానీ ఈసారి బొమ్మ తిరగబడుతోంది అని అర్ధం అవుతోంది. రాయలసీమలో ఎన్నడూ లేని విధంగా ఇంకా చెప్పాలంటే గత పాతికేళ్లలో చూడని విధంగా టీడీపీ కూటమి ఏకంగా నలభై సీట్లకు పై దాటి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపించబోతున్నాయి.

అదే సమయంలో జగన్ సొంత జిల్లా కడపలో అయితే పదికి పది సీట్లు 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం అందులో ఆరు సీట్లలో వైసీపీ ఇబ్బంది పడుతోంది అని అంటే కనుక వైసీపీని సొంత జిల్లావాసులు సైతం ఎంత దూరం పెట్టారు అన్నది అర్ధం అవుతోంది.

మరో వైపు చూస్తే కర్నూల్ లో ఒకనాడు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇపుడు కోలుకోలేని కష్టాలను ఎదుర్కొంటోంది. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా వైసీపీ కంచుకోటలు కూలిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో పరిస్థితి పూర్తిగా టీడీపీకి అనుకూలంగా కనిపిస్తోంది.

ఈ మొత్తం పిక్చర్ చూసిన వారు చెప్పేది ఒక్కటే వైసీపీకి రాయలసీమలో ఇంతటి దయనీయ పరిస్థితి ఎందుకు వచ్చింది అని. వైసీపీని స్థాపించాక జగన్ కి కడప లోక్ సభలో అయిదున్నర లక్షల ఓట్ల భారీ మెజారిటీ కట్టబెట్టిన సీమ జిల్లాలు ఆయనకు 2014లోనూ అండగా నిలిచిన ప్రాంతాలు అప్పట్లో 67 ఎమ్మెల్యే సీట్లలో అత్యధిక శాతం సీమ నుంచే ఇచ్చిన జిల్లాలు ఇపుడు జగన్ వెనక ఎందుకు నిలబడలేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది.

దానికి కారణం ప్రతిపక్షంలో ఉన్నపుడు మెప్పించిన జగన్ తీరా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా అయిదేళ్ల పాలనలో మాత్రం మెప్పించలేక పోయారు అని అంటున్నారు. జగన్ అన్న మూడు అక్షరాల చూటూ తిరిగిన రాయలసీమ రాజకీయం దాదాపు పుష్కరం కాలం తరువాత కొత్త రూపు సంతరించుకున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ ని వీడి సైకిలెక్కుతున్న ఈ జిల్లాలు వైసీపీ ఏలుబడిలో తాము ఏమీ అభివృద్ధి సాధించుకోలేకపోయామని భావించినట్లుగా కనిపిస్తోంది.

సీఎమ బిడ్డగా జగన్ నే ఎక్కువగా ఆదరించి ఓట్లూ సీట్లూ అప్పగించిన రాయలసీమకు గత అయిదేళ్ళలో న్యాయం జరగలేదు అని అంటున్నారు. అందుకే వారి ధర్మాగ్రహం కాస్తా ఓట్ల రూపంలో పెను సునామీగా మారి టీడీపీ కూటమికి కలసి వచ్చిందని అంటున్నారు. వైసీపీకి గట్టి పట్టున్న సీఎం జిల్లాలే జారిపోతే ఆ పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకమే అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.