టీడీపీ కురువృద్ధుడు.. రాజకీయాలకు తెరదించేశారా..?
గత ఎన్నికల్లో రాయపాటికి అతి కష్టం మీద చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఆయన కూడా పట్టుబట్టి.. అలిగి మరీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 6 Jan 2024 3:56 AM GMTరాజకీయ కురువృద్ధుడు.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇక, ప్రత్యక్ష రాజకీయాలకు తెరదింపేసి నట్టేనా? ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి దాదాపు విరమించుకున్నారా? అంటే.. ఔననే అంటున్నా రు పరిశీలకులు. టీడీపీలోనే ఉన్న రాయపాటి.. నరసారావు పేట టికెట్ కోసం.. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబుకు వర్తమానం పంపించారు. అయితే, ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాకపోగా.. మరో నాయకుడికి ఇక్కడ టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గత ఎన్నికల్లో రాయపాటికి అతి కష్టం మీద చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఆయన కూడా పట్టుబట్టి.. అలిగి మరీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. కానీ, వైసీపీ నేతపై ఆయన ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి వ్యాపారాలు, ఇంటికే పరిమితమయ్యారు. పైగా వృద్ధాప్య సమస్యలు కూడా రాయపాటిని వెంటాడుతున్నా యి. ఈ నేపథ్యంలో టీడీపీ ఆయనకు ఈ దఫా టికెట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు వైసీపీ కూడా రాయపాటి చేరేందుకు కొన్నాళ్లపాటు ఎదురు చూసినా.. ఆయన నుంచి సరైన స్పందన లేదు.
దీంతో వెరసి వైసీపీ కూడా రాయపాటిని దూరం పెట్టింది. ఇప్పుడు టీడీపీ కూడా టికెట్ లేదనే సంకేతాలు ఇచ్చేయడంతో రాయపాటి ప్రత్యక్ష రాజకీయాలు.. పూర్తిగా ముగిసినట్టేననే వాదన వినిపిస్తోంది. అయితే.. ఆయనకు ఉన్న ఏకైక మార్గం.. టీడీపీని గెలిపించడమే. పార్టీ గెలుపునకు రాయపాటి కృషి చేయడం ద్వారా.. ఆయనకు నామినేటెడ్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు రాయపాటి కుమారుడుకూడా యాక్టివ్‌గా లేక పోవడంతో ఆయనకు కూడా.. టికెట్ దక్కుతుందనే పరిస్థితి లేకుండా పోయింది.
దీంతో పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే తప్ప.. రాయపాటి కుటుంబానికి రాజ్యసభ లేదా.. ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం లేదని ఆయన వర్గంలో చర్చసాగుతోంది. ఇప్పటి వరకు అయితే.. నరసారావు పేట టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాయపాటి కృషి చేస్తే తప్ప ఎలాంటి ఆశించిన ఫలితం ఆయనకు చేరువ అయ్యే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.