"జనసేనలో రాయుడు" అనే బ్రేకింగ్ బ్యాక్ టు పెవిలియన్!
అనంతరం గుంటూరు జిల్లాలోని పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్కూళ్లకు డొనేషన్లు ఇచ్చారు.
By: Tupaki Desk | 11 Jan 2024 4:32 AM GMTఒక సినిమాలో ఎంఎస్ నారాయణ తన కొడుకుతో... “గోలీ సోడా కొట్టడం అంటే.. పీజీ పాసయినంత ఈజీ కాదు నాయనా” అంటాడు! అంటే... ఆయన దృష్టిలో పీజీ అనేది ఈజీ.. గోలీ సోడా కొట్టడం అనేది కష్టం అని!! ఆ సంగతి కాసేపు పక్కనపెడితే... టీం ఇండియా తరుపున బ్యాట్ పట్టుకుని ప్రత్యర్థులను బెంబేలెత్తించిన బ్యాటర్, ఐపీఎల్ లో తనదైన షాట్ లతో మెరిపించిన ఫైటర్ అంబటి రాయుడు.. తన పొలిటికల్ కెరీర్ పై ప్రస్తుతానికి ఒక నిర్ణయం తీసేసుకున్నారు!
అవును... క్రికెట్ మైదానంలో తనదైన ఆటతీరుతో అలరించిన తెలుగువాడు.. అంబటి రాయుడు. ప్రత్యేకంగా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతూ తన ఫ్యాన్ బెల్ట్ ను మరింత పెంచేసుకున్నాడు. ఫోర్త్ డౌన్ లో తనొక బెస్ట్ ఆప్షన్ అని పలుమార్లు నిరూపించుకున్నాడు! ఇలా ఉండగా... ఆల్ ఆఫ్ సడన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు అంబటి. ఇందులో భాగంగా పలుమార్లు వైఎస్ జగన్ ని కలిశారు.
అనంతరం గుంటూరు జిల్లాలోని పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్కూళ్లకు డొనేషన్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో గుంటూరు నుంచి వైసీపీ ఎంపీగా బరిలోకి దిగుతాడని జోరుగా ప్రచారం నడిచింది. అంతలోనే ఏమైందో ఏమో కానీ... వారంరోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేశాడు. దీంతో ప్రత్యర్థులకు వైసీపీ చిక్కిందనే కామెంట్లు వినిపించాయి!
అనంతరం ఈ రాజీనామాపై అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా... త్వరలో దుబాయ్ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో ముంబై తరుపున ఆడనున్నట్లు వెల్లడించాడు. అందులో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని.. అందుకే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసినట్లు తెలిపాడు. దీంతో ఆ ఎపీసోడ్ ముగిసింది. అలా ఆ ప్రకటన వచ్చిన రెండ్రోజులకే పవన్ తో భేటీ అయ్యారు రాయుడు.
క్రికెట్ కోసం వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రాయుడు.. ఆ ప్రకటన చేసిన రెండ్రోజులకే జనసేన అధినేత పవన్ తో భేటీ కావడంతో వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. ఇంకేంటి... రాయుడు జనసేనలో జాయిన్ కాబోతున్నాడని.. జగన్ నుంచి దక్కని హామీ పవన్ నుంచి దక్కిందని మీడియాలో మోత మోగిపోయింది. సాయంత్రంలోపు మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రాయుడు సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో పెద్ద పోస్ట్ పెట్టాడు.
ఇందులో భాగంగా... "నేను సహృదయంతో ఏపీ ప్రజలకు సేవ చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చాను. నా ఆకాంక్షలు నెరవేరతాయనే వైఎస్సార్సీపీలో చేరాను. ఇందులో భాగంగా చాలా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అర్ధం చేసుకున్నాను. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాల్లో భాగం అయ్యాను. అయితే కొన్ని కారణాలవల్ల వైసీపీతోలో కొనసాగితే నా ఆశ నెరవేరదేమో అనిపించింది. ఇందులో ఎవర్నీ నిందించడానికి లేదు."
"నా ఆలోచనా ధోరణి.. వైసీపీ భావజాలం విభిన్నంగా ఉంది. అంతేకానీ ఏదో ఒక స్థానం నుంచి సీటు కోరడం, ఎలక్షన్స్ లో పోటీ చేయడం వంటి అంశాల వల్ల నేను బయటకు రాలేదు. రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనుకున్నాను. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పవన్ అన్నను కలవాలని నా శ్రేయోభిలాషులు, మిత్రులు, కుటుంబ సభ్యులు సూచించారు. అందుకే కలిశాను."
"ఈ సందర్భంగా పవన్ అన్నతో రాజకీయాలు సహా చాలా అంశాలపై చర్చించాను. ఆయన ఐడియాలజీని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. నా విజన్, ఆయన ఐడియాలజీ చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ క్రమంలో... క్రికెట్ కమిటిమెంట్స్ లో భాగంగా దుబాయ్ వెళ్తున్నా. ఏపీ ప్రజల కోసం నిలబడటానికి నేను ఎప్పుడూ సిద్దమే" అని అంబటి రాయుడు స్టేట్ మెంట్ విడుదల చేశారు.
దీంతో పాలిటిక్స్ లో చేరి తనదైన శైలిలో ఫోర్లు, సిక్స్ లు కొట్టినంత సులువుగా నిర్ణయాలు మార్చేసుకుంటున్నాడనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. ఏది ఏమైనా... ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో అంబటి రాయుడి చర్చ లేనట్లే అనుకోవచ్చు!! ఈ సమయంలో... "జనసేనలో రాయుడు" అనే బ్రేకింగ్ కొన్ని గంటలకే బ్యాక్ టు పెవిలియన్ అయిపోయిందనే కామెంట్లు దర్శనమిస్తున్నాయి!