అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ సీటు!
అంచనాలకు తగ్గట్లే ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకున్నారు.
By: Tupaki Desk | 29 Dec 2023 6:38 AM GMTఅంచనాలకు తగ్గట్లే ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ఆయన్ను.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడనప్పటికి.. ఆయనకు ఆ మేరకు హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
గడిచిన ఆరు నెలలుగా గుంటూరు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఫోకస్ చేయటం.. ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పర్యటిస్తూ.. ప్రజలకు చేరువ కానున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఆయనకు గుంటూరు లోక్ సభ స్థానానికి సంబంధించి పార్టీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే.. పార్టీలో చేరని నేపథ్యంలో.. ఆయన ఎప్పుడు పార్టీ కండువా వేసుకుంటారా? అన్నది ప్రశ్నగా మారింది.
ఈ నిరీక్షణకు తెర దించుతూ తాజాగా పార్టీలో చేరటం తెలిసిందే. పార్టీలోకి ఆహ్వానించిన సందరభంగా గుంటూరుఎంపీ స్థానం మీద ఫోకస్ చేయాలని.. ఆ దిశగా పనులు చేసుకోవాలన్న స్పష్టమైన అభయం సీఎం జగన్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ చేతులుగా మీదుగా పార్టీలో చేరిన రాయుడి వెంట.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. వైసీపీ లోక్ సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉండటం చూస్తే.. రాయుడికి ఇస్తున్న ప్రాధాన్యత ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు.