బ్యాంకుల్లో మీ, మీవారి డిపాజిట్లను ఇలా క్లైమ్ చేసుకోండి!
వివిధ బ్యాంకుల్లో వ్యక్తులు తమ అవసరాల కోసం ఖాతాలు తెరుస్తారు. అలాగే కొంత మొత్తం నగదును కూడా ఆ ఖాతాల్లో వేస్తారు
By: Tupaki Desk | 18 Aug 2023 9:20 AM GMTవివిధ బ్యాంకుల్లో వ్యక్తులు తమ అవసరాల కోసం ఖాతాలు తెరుస్తారు. అలాగే కొంత మొత్తం నగదును కూడా ఆ ఖాతాల్లో వేస్తారు. అయితే ఎక్కువ బ్యాంకు ఖాతాలను నిర్వహించలేక అలాగే వదిలేస్తుంటారు. కాలక్రమేణా వాటిని మరిచిపోతారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా బ్యాంకు ఖాతాలు తెరిచి నగదు డిపాజిట్లు వేస్తారు. అయితే దురదృష్టవశాత్తూ మరణిస్తే.. ఆ డిపాజిట్ల వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకుంటే వాటిని ఎవరూ తీసుకోలేరు. అంటే ఆ ఖాతాలు అన్ క్లైమ్డ్ డిపాజిట్లుగా మిగిలిపోతాయి. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల అన్ క్లైమ్డ్ డిపాజిట్లు మూలుగుతున్నాయి. వీటిని ఆయా వ్యక్తులకు, వ్యక్తులు లేకుంటే వారసులకు అందించడానికి రిజర్వ్ బ్యాంక్ నడుం కట్టింది.
బ్యాంకుల్లో ఎన్నో ఏళ్లుగా మూలుగుతున్న అన్ క్లైమ్డ్ డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ముందడుగు వేసింది. ఎవరూ క్లైమ్ చేసుకోకుండా వేర్వేరు బ్యాంకుల్లో మూలుగుతున్న అన్ క్లైమ్డ్ డిపాజిట్లను ఒకే చోట తెలుసుకొనేందుకు UDGAM (Unclaimed Deposits Gateway To Access Information) పేరిట ఓ సెంట్రలైజ్డ్ పోర్టల్‌ను ఆర్బీఐ ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా అన్ క్లైమ్డ్ మొత్తాలను కావాలంటే తీసుకోవడం లేదా ఆయా ఖాతాలను తిరిగి పునరుద్ధరించుకోవచ్చు.
ఏదైనా బ్యాంకు ఖాతాలో నగదు పదేళ్లు లేదా అంతకు మించిన వాడుకలో లేకుండాపోతే దాన్ని అన్ క్లైమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. ఇలా ఎవరూ తీసుకోకుండా మిగిలిపోయిన డిపాజిట్లలోని ఆ డబ్బులన్నీ బ్యాంకుల్లోనే ఉండిపోతుంటాయి. అటువంటి ఖాతాల వివరాలను ఆర్బీఐ ప్రవేశపెట్టిన తాజా పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్, సిటీ బ్యాంకులకు సంబంధించిన అన్ క్లైమ్డ్ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్ లో లభించనున్నాయి. అక్టోబర్ 15 నాటికి ఇతర బ్యాంకుల వివరాలు సైతం ఈ పోర్టల్ లో అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి తెలుసుకోవాలంటే ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. అసలు బ్యాంకులో ఖాతా ఉందో లేదో తెలీకపోతే ఆ వివరాలు తెలుసుకోవడం కష్టం. ఆర్బీఐ ప్రవేశపెట్టిన పోర్టల్ ద్వారా ఆ కష్టాలు తీరనున్నాయి. డిపాజిట్‌దారులు లేదా మరణించిన ఖాతాదారుల వారసులకు సంబంధిత డిపాజిట్లను వెతికి పట్టుకోవడం తేలికవుతుంది.
కాగా తమ డిపాజిట్ వివరాలు తెలుసుకోవాలనుకునేవారు ముందుగా UDGAM (Unclaimed Deposits Gateway To Access Information) వెబ్‌సైట్ లోకి వెళ్లి ముందుగా రిజిస్టర్ అవ్వాలి. తర్వాత లాగిన్ అయ్యి ఖాతాదారు పేరు పేర్కొనాలి. ఫలానా బ్యాంకు వివరాలే కావాలా? అన్ని బ్యాంకుల వివరాలూ కావాలా? అనే ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పుట్టిన తేదీ వివరాలు పేర్కొనాలి. ఒకవేళ ఆ వివరాలూ ఏవీ లేకపోతే గ్రామం, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలు తెలుసుకోవాలి. తర్వాత సెర్చ్ చేస్తే ఆ పేరుతో ఉన్న వ్యక్తుల వివరాలు కనిపిస్తాయి.
ఈ క్రమంలో ఏదైనా బ్యాంకులో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు కనిపిస్తే సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ మరణించిన వ్యక్తుల చట్టబద్ధ వారసులైతే సంబంధిత బ్యాంకులో నిర్దేశిత పత్రాలు సమర్పించి అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను సెటిల్ చేసుకోవచ్చు.